
తిరుపతి లడ్డు కల్తీ కేసు.. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇ"తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈ భారీ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన ‘నేరాల ఆదాయం పై లోతైన విచారణను ప్రారంభించారు.
సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లలోని అంశాలను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా సుమారు రూ.250 కోట్ల మేర అవినీతి జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా చూపించి తక్కువ ధరకే కొనుగోలు చేసి అధిక ధరలకు బిల్లులు చెల్లించుకోవడం ద్వారా ఈ సొమ్మును కాజేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ భారీ మొత్తాన్ని నిందితులు ఏయే మార్గాల్లోకి మళ్లించారనే దానిపై ఈడీ నిఘా పెట్టింది.
కాగా ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా గుర్తించగా అందులో టీటీడీకి చెందిన ఉన్నతాధికారులు, నెయ్యి సరఫరా చేసిన ప్రైవేటు సంస్థల యజమానులు, మధ్యవర్తులు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా సాగిన హవాలా నెట్‌వర్క్ ద్వారా సుమారు రూ.20 కోట్లు తిరుపతిలోని కొంతమంది వ్యక్తులకు చేరినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో ఈడీ ఈ కోణంలో కీలక ఆధారాలు సేకరిస్తోంది. అయితే బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయింది. నాణ్యతా పరీక్షల్లో పామోలిన్ ఆయిల్ ఇతర పదార్థాల మిశ్రమం ఉన్నట్లు రసాయన నివేదికలు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ కేసు నమోదు చేయడంతో నిందితుల బ్యాంక్ ఖాతాల సీజింగ్, స్థిర చరాస్తుల జప్తు వంటి కఠిన చర్యలు రానున్న రోజుల్లో మరిన్ని నిజాలు బయటకి వచ్చే అవకాశం ఉంది. కాగా లడ్డూ పవిత్రతను తాకట్టు పెట్టిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టేలా ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
