
తిరుపతి జూ లో నెల రోజుల్లో మూడు పెద్దపులుల మృతి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌లో నెల రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు, ఓ జాగ్వార్ మృతి చెందాయి. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగానే ఇవి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ల మగ జాగ్వార్ ‘లావా’ జూలై 28న అనేక అవయవాల వైఫల్యం కారణంగా మృతి చెందింది. 2017 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న లావాను 2013 జనవరి 1న హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి జంతు మార్పిడి కార్యక్రమం కింద తిరుపతి జూకు తీసుకొచ్చారు.
అదేవిధంగా ‘సత్య’ అనే 17 ఏళ్ల మగ చిరుతపులి ఆగస్టు 15న వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. పోస్టుమార్టం పరీక్షల్లో శ్వాస ఆడకపోవడం, తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 16 ఏళ్ల ఆడ చిరుతపులి ‘విముద’ ఆగస్టు 27న వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందింది. కడప జిల్లా గండికోట ప్రాంతం నుంచి రక్షించిన విముదను 2014 సెప్టెంబర్ 19న తిరుపతి జూకు తరలించారు. పోస్టుమార్టంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తీవ్ర గ్యాస్ట్రైటిస్ ఉన్నట్లు తేలింది. మృతి చెందిన మూడు పెద్దపులుల మృతదేహాలకు అధికారుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు జూ అధికారులు తెలిపారు.
