Let's talk: editor@tmv.in
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దారుణం

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దారుణం

Panthagani Anusha
11 డిసెంబర్, 2025

విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాల్సిన అధ్యాపకులే రాక్షసత్వం చూపించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్ యూ ) క్యాంపస్‌లోనే ఓ యువ విద్యార్థినిపై లైంగిక దాడి, వేధింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన దారుణ ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, ఎ.శేఖర్ రెడ్డిలను మంగళవారం తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.

కార్యాలయంలోనే దారుణం, బ్లాక్‌మెయిలింగ్ పర్వం

తిరుపతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో ఎన్ఎస్ యూలో బీఈడీ కోర్సులో చేరిన బాధిత విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ అకాడమిక్ విషయాలలో సహాయం చేస్తానంటూ ఆమెను నమ్మించి తన కార్యాలయంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ దారుణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి తీసినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ ఆ సాక్ష్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ విద్యార్థినిని నిరంతరం బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

హాస్టల్ వార్డెన్ చొరవతో వెలుగులోకి..

నవంబర్ 21న పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థిని తీవ్ర ఆందోళన భయంతో ఆమె ఒడిశాకు చెందిన యువతి కావడంతో అదే ప్రాంతానికి చెందిన హాస్టల్ వార్డెన్ ఆమెను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దింతో బాధిత విద్యార్థిని నవంబర్ 24న యూనివర్సిటీ యాంటీ-సెక్సువల్ హరాస్‌మెంట్ కమిటీకి హాస్టల్ వార్డెన్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

యూనివర్సిటీ విచారణ... పోలీసులకు ఫిర్యాదు

విద్యార్థిని ఫిర్యాదు మేరకు విశ్వవిద్యాలయం డిసెంబర్ 1న ఒక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా విద్యార్థిని-లక్ష్మణ్ కుమార్ మధ్య గతంలో సంబంధం ఉన్నట్లు తేలినప్పటికీ విద్యార్థిని ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదని ఉపకులపతి జీఎస్ఎన్ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత, డిసెంబర్ 6న యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. మొదటగా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 75(1), 77, 79, 351(2) ఆర్/డబ్ల్యు 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే జరిగిన సంఘటనతో మనస్తాపం చెందిన విద్యార్థిని చదువు మానేసి స్వగ్రామమైన ఒడిశాకు వెళ్ళిపోయింది. దీంతో ఆమె వాంగ్మూలం కోసం తిరుపతి వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. మురళీ మోహన్‌రావును ప్రత్యేకంగా ఒడిశాకు పంపారు.

బాధిత విద్యార్థిని వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం, కేసుకు సెక్షన్ 63 (బలవంతపు లైంగిక చర్య) సెక్షన్ 68 (అధికారంలో ఉన్న వ్యక్తి లైంగిక దుర్వినియోగం) లను చేర్చారు. ఈ రెండు సెక్షన్ల చేరికతో నేరం తీవ్రత మరింత పెరిగింది.

ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్

పోలీసులు సేకరించిన కీలక సాక్ష్యాలు, విద్యార్థిని వాంగ్మూలం ఆధారంగా మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.

ఈ ఘటన ఎన్ఎస్ యూ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మహిళా విద్యార్థుల భద్రతా ప్రమాణాలపై అనేక ఆందోళనలను రేకెత్తించింది. క్యాంపస్‌లలో పనిచేసే సిబ్బంది ప్రవర్తనపై యూనివర్సిటీ యాజమాన్యాలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.