Let's talk: editor@tmv.in
తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Dantu Vijaya Lakshmi Prasanna
3 డిసెంబర్, 2025

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, 10మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే, కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట్ వద్ద బోల్తా పడింది. బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, 10 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. గాయపడినవారిలో కడప, రాయచోటి, బెంగుళూరుకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ …

కర్ణాటక హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా ఘటనపై మంత్రి ఆరా తీశారు. ప్రొద్దుటూరుకు చెందిన మహిళ మృతి పట్ల సంతాపం తెలిపారు, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు నిర్వహణతో ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో నెడితే ఉపేక్షించేది లేదని, ప్రమాదానికి కారణమైన హరిత ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీసులపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా మంత్రి వార్నింగ్ ఇచ్చారు.