Let's talk: editor@tmv.in
తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి నేతల కిడ్నాప్

తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి నేతల కిడ్నాప్

Panthagani Anusha
6 ఫిబ్రవరి, 2026

తిరుపతి సమీపంలోని తిరుచానూరు పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న విద్యార్థి నేతల కిడ్నాప్ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రగిరిలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ, అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకులను దుండగులు అడ్డగించి దాడి చేసి అపహరించుకుపోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీసులు సకాలంలో స్పందించి బాధితులను సురక్షితంగా విడిపించారు.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పరికిడోన గ్రామానికి చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వి. రెడ్డి కుమార్, ప్రధాన కార్యదర్శి షేక్ అలీ అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నాయకుడు వినోద్ కుమార్ మరికొందరితో కలిసి మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు బయలుదేరారు. తిరుచానూరు గ్రామం లెమన్‌ట్రీ హోటల్ సమీపంలోని వర్త క్రాస్ వద్దకు రాగానే, మూడు ఇన్నోవా కార్లలో వచ్చిన సుమారు 30 మంది దుండగులు వీరి వాహనాన్ని అడ్డగించారు. విద్యార్థి నేతలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అనంతరం షేక్ అలీ అక్బర్, వినోద్ కుమార్‌లను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించుకుని చిత్తూరు వైపు వేగంగా తీసుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ అక్బర్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. దాడి చేసిన వారు తాము మోహన్‌బాబు యూనివర్సిటీ పీఆర్వో సతీష్, మోహన్‌బాబు, మంచు విష్ణు మనుషులమని చెప్పుకున్నట్లు బాధితులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు కందారపు మురళి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడికి సమాచారం అందించారు. వెంటనే తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి శోధన చేపట్టారు. గంటన్నర వ్యవధిలోనే కిడ్నాపర్లను వెంబడించి పట్టుకుని ఇద్దరు విద్యార్థి నాయకులను రక్షించారు. అదేవిధంగా ఘటనలో ఉపయోగించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కిడ్నాప్, నేరపూరిత కుట్ర, దాడి వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి ఈ కేసులో యూనివర్సిటీ పీఆర్వో రావూరు సతీష్‌ను ఏ-1గా, సినీ నటుడు మోహన్‌బాబును ఏ-2గా, మంచు విష్ణును ఏ-3గా చేర్చారు. కాగా బుధవారం ఈ కేసుకు సంబంధించి పీఆర్వో సతీష్‌తో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో యూనివర్సిటీ బౌన్సర్లు, కొంతమంది విద్యార్థుల పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. మరోవైపు యాజమాన్యం పాత్రపై లోతైన విచారణ జరుపుతున్నామని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.