Let's talk: editor@tmv.in
తిరుపతిలో అమానుషం... కన్నకూతురిని చంపి పాతిపెట్టిన తల్లి

తిరుపతిలో అమానుషం... కన్నకూతురిని చంపి పాతిపెట్టిన తల్లి

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

లోకం తెలియని ఆ పసిపాపకు అమ్మే సర్వస్వం కానీ తన సుఖం కోసం అడ్డుగా ఉందని భావించి, ముక్కుపచ్చలారని ముప్పై నెలల పసిగుడ్డును ప్రియుడితో కలిసి కడతేర్చింది. తిరుపతి జిల్లాలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు ఆశాలత గత ఏడాదిన్నర కాలంగా తన భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెకు రెడ్డి కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో వీరిద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అయితే తమ వివాహానికి ఆశాలతకు ఉన్న చిన్నారి అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు చిన్నారిని చంపాలని పథకం పన్ని హత్యకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో గత రెండు వారాలుగా ఆశాలతతో పాటు చిన్నారి కూడా కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం కలిగింది. చిన్నారి ఎక్కడ అని ప్రశ్నించిన ప్రతిసారీ ఆశాలత పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి ఫోన్ కాల్ డేటా, ఆమె కదలికలను నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వర్ణముఖి నది తీరానికి వెళ్లి అక్కడ చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మరణం ఎప్పుడు సంభవించింది, ఏ విధంగా హత్య చేశారు అనే విషయాలపై స్పష్టత కోసం వైద్య నివేదికకై పోలీసులు నిరీక్షిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 103(1), 201 కింద కేసులు నమోదు చేసి నిందితులను ఇద్దరినీ అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.