Let's talk: editor@tmv.in
తారాస్థాయికి సిద్ధరామయ్య–డీకే మధ్య పోరు

తారాస్థాయికి సిద్ధరామయ్య–డీకే మధ్య పోరు

Pinjari Chand
25 నవంబర్, 2025

కర్ణాటకలో సీఎం కుర్చీపై కీచులాట ఎంతకు తెగడం లేదు. సీరియల్ ఎపిసోడ్లలా రోజూ సాగుతూనే ఉంది. సోమవారం ముఖ్యమంత్రి కుర్చీపై సిద్ధరామయ్య–డీకే శివకుమార్ మధ్య నెలకొన్న అంతర్గత ఘర్షణ మరింత వేడెక్కింది. డీకే శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ఢిల్లీకి చేరి లాబీయింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య మాత్రం హైకమాండ్ నిర్ణయమే ఫైనల్, వాళ్లు చెబితే నేనే కొనసాగుతా. నేను, డీకే ఇద్దరం కూడా అదే పాటించాలని స్పష్టం చేశారు.

ఢిల్లీకి డీకే శిబిరం

ఇప్పటికే దాదాపు ఆరుగురు ప్రో–శివకుమార్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రే ఢిల్లీకి పయనమయ్యారు. మరికొందరు కూడా త్వరలో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ చేరిన వారిలో హెచ్.సి.బాలకృష్ణ, కె.ఎం.ఉదయ, నాయక మొట్టమ్మ, ఇక్బాల్ హుస్సేన్, శరత్ బాచెగౌడ, శివగంగ బసవరాజ్ ఉన్నారు. 2023లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం జరిగిందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో… ప్రభుత్వ పాలన 2.5(రెండున్నర సంవత్సరాలు) ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సమయంలోనే సీఎం మార్పు ఉంటుందన్న ఊహాగానాలు మళ్లీ ఉధృతమయ్యాయి. దీనినే కొందరు ‘నవంబర్ రివల్యూషన్’ అని కూడా పిలుస్తున్నారు. అయితే నా వర్గంలో 140 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ నేను కాంగ్రెస్ ను వీడను అని ఇటీవలే ప్రకటించారు. అయితే సీఎంకు, డీకేకు మధ్య సరైన చర్చలు లేవని డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరడంతో స్పష్టమవుతోంది.

దళిత సీఎం డిమాండ్‌తో రంగంలోకి ఆయా వర్గాల నేతలు

కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ‘దళిత్ సీఎం కావాలి’ అన్న డిమాండ్‌తో పోటీలోకి దిగారు. దీంతో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టతరం అయ్యాయి. అలాగే మరో మంత్రి కేహెచ్ మునియప్ప కూడా దళిత సీఎం రేసులో ఉన్నారు.

సిద్ధరామయ్య–ఖర్గే మీటింగ్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం బెంగళూరులో ఉండటంతో సిద్ధరామయ్య ఆయనను ఇప్పటికే కలిశారు. ఖర్గే త్వరలో ఢిల్లీకి చేరనుండగా, రాహుల్ గాంధీ కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చాక కర్ణాటక రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.

ఇక శివకుమార్ మాత్రం ‘ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారన్నది నాకు తెలియదు’ అని చెప్పినా ఆయన శిబిరం మాత్రం రాజధానిలో లాబీయింగ్ ను వేగవంతం చేస్తోంది.

కేబినేట్ లో మార్పులు?

కేబినెట్ లో కొత్తగా మంత్రులను తీసుకోవడం లేదా ఉన్న వారి శాఖలను మార్చడం గురించి ప్రస్తుత పరిణామాల్లో ముందుకు తీసుకెళ్లాలని సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. ముందు నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం చెప్పాలని డీకే శిబిరం పట్టుదలగా ఉంది. ఒకవేళ హైకమాండ్ కేబినెట్ పునర్వ్యస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సిద్ధరామయ్యే పూర్తి 5 ఏళ్లు సీఎం గా కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. అదే జరిగితే డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఆశలపల్లకిగా మిగిలిపోనుంది.

తారాస్థాయికి సిద్ధరామయ్య–డీకే మధ్య పోరు - Tholi Paluku