
తాడ్మెట్లలో సీఆర్‌పీఎఫ్ అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభం
2010లో జరిగిన తాడ్మెట్ల నక్సల్ దాడిలో అమరులైన 76 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని స్మరించుకుంటూ ఛత్తీస్‌గఢ్‌లోని తాడ్మెట్లలో స్మారక స్థూపాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్‌సింగ్, ఛత్తీస్‌గఢ్ పోలీసు అదనపు డీజీపీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ సుక్మా జిల్లా కలెక్టర్ అమిత్‌కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు. స్మారక స్థూపం వద్ద అమరులైన జవాన్లకు అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాడ్మెట్ల ప్రాంత అభివృద్ధికి చేపట్టే పలు ప్రాజెక్టుల గురించి జిల్లా కలెక్టర్ అమిత్ కుమార్ వివరించారు. రూ.4 కోట్ల వ్యయంతో అమరవీరులు ప్రాణత్యాగం చేసిన ప్రదేశానికి రహదారి నిర్మాణానికి ఆమోదం లభించిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 50కి పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, అలాగే ప్రాథమిక పాఠశాల, పంచాయతీ భవన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక ప్రజలకు దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
అమరుల త్యాగాన్ని స్మరించుకుంటాం
బస్తర్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ, బస్తర్ ప్రాంతంలో శాంతి, భద్రత, అభివృద్ధి కోసం స్థానిక ప్రజలు, భద్రతా దళాలు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. గత 30–40 సంవత్సరాల్లో బస్తర్–సుక్మా ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలకు చెందిన 1,500 మందికిపైగా సిబ్బంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. నక్సల్ హింసలో 2,100కు పైగా నిరపరాధ గ్రామస్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ అమరవీరులందరికీ ఈ రోజు నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని స్మరించుకుంటున్నామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, మార్చి 31న ఇద్దరు మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో సుక్మా జిల్లా పూర్తిగా మావోయిస్టు ప్రభావం నుంచి విముక్తి పొందినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ జి చవన్ తెలిపారు. లొంగిపోయిన మహిళలు నక్సల్ సంస్థలో కంపెనీ నంబర్ 8కు చెందినవారని, వారి తలలపై మొత్తం రూ.16 లక్షల బహుమతి ఉందని చెప్పారు. ఈ లొంగుబాటులో భాగంగా ఒక ఇన్సాస్ ఎల్‌ఎంజీ, రెండు ఏకే-47 తుపాకులు సహా ఆరు ఆటోమేటిక్ ఆయుధాలు, దాదాపు రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
