Let's talk: editor@tmv.in
తాడేపల్లిలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు

తాడేపల్లిలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు

Panthagani Anusha
4 జనవరి, 2026

దేశంలో మహిళా అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని ధారపోసిన విప్లవ వనిత సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు చేశారు.

అక్షరాస్యతే ఆయుధంగా పోరాటం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అక్షరాస్యత ద్వారానే మహిళాభ్యుదయం సాధ్యమని నమ్మిన ధీశాలి సావిత్రీబాయి అని పేర్కొన్నారు. సమాజం నుంచి ఎదురైన ఎన్నో అవమానాలను ఆంక్షలను అధిగమించి, తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో మహిళల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించిన ఘనత ఆమెకే దక్కుతుందని కొనియాడారు. ఆమె జీవితం నేటి తరానికి, ముఖ్యంగా మహిళా నాయకులకు నిరంతరం స్ఫూర్తిదాయకమని వారు వెల్లడించారు.

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సావిత్రీబాయి పూలే ఆశయాలకు అనుగుణంగానే పాలన సాగించిందని నాయకులు గుర్తు చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లోనూ రాజకీయంగానూ మహిళలకు ప్రాధాన్యతనిచ్చి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టామని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత అనే లక్ష్యాల కోసం పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకాల రావు, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు నారాయణ మూర్తి, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ దస్తగిరి సహా పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.