Let's talk: editor@tmv.in
తాగి సెక్షన్లు చెబితే..జైలే: సీపీ సజ్జనార్

తాగి సెక్షన్లు చెబితే..జైలే: సీపీ సజ్జనార్

Pinjari Chand
1 జనవరి, 2026

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనం నడపొద్దని హెచ్చరిస్తూ హైదరాబాద్ పోలీసులు చమత్కారంగా ట్రాఫిక్ అడ్వైజరీని బుధవారం విడుదల చేశారు. చట్టాలు ఉల్లంఘించిన తర్వాత పోలీసులతో వాదనలు పెట్టుకునే వారిని ఉద్దేశిస్తూ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హాస్యంతో కూడిన సందేశాన్ని గట్టిగానే ఇచ్చారు.

భారతీయ చట్టాల్లో సెక్షన్ 123, 567 అనే నిబంధనలను ఇప్పటివరకు రాయలేదు. కానీ అర్ధరాత్రి 2 గంటలకు మద్యం మత్తులో వాహనం నడుపుతూ, పోలీసులకు దొరికినప్పుడు నోటికొచ్చిన పై సెక్షన్ల లాంటివి చెప్పడం ఇక మానుకోవాలి. లేదా లేని చట్టాలను మా సిబ్బందికి బోధించాలనుకుంటే… మీ భవిష్యత్ స్పష్టమే. స్టాండప్ కామెడీ, కథారచన లేదా కుటుంబంలో వైరల్ అవమానం అని సజ్జనార్ తన ప్రకటనలో వ్యంగంగా హెచ్చరించారు.

మద్యం + కల్పిత చట్టాలు కలిస్తే జరిగే పరిణామాలను ఆయన హాస్యంగా వివరించారు.

ఇంటర్నెట్​ లో వైరల్ : కుటుంబ, స్నేహితుల వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రతిభ ప్రదర్శన తెలుస్తుంది.

వాహనం డిటెన్షన్: మీ కారు పోలీస్ స్టేషన్లో బుద్ధిగా, క్రమశిక్షణగా ఉంటుంది.

మీ కల్పిత చట్టాలకు రియాలిటీ చెక్: చట్టంలో ఉన్న నిజమైన సెక్షన్లు న్యాయవాది వినిపించగానే మీ న్యాయ పాండిత్యం బయటపడుతుంది. మీ అహాంకారం కూలిపోతుందని తెలిపారు.

చివరగా ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని గుర్తు చేశారు.

కథా పుస్తకాలు సరదా. మద్యం కూడా సరదానే (బాధ్యతతో). కానీ మద్యం మత్తులో వాహనం నడపడం, అర్ధరాత్రి న్యాయ నిపుణుడిలా నటించడం మాత్రం సరదా కాదని స్పష్టం చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన సజ్జనార్, ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

కొత్త సంవత్సరం అందరికీ సంతోషకరంగా ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, మద్యం తాగి వాహనాలు నడపడం లేదా మాదక ద్రవ్యాల వినియోగంతో దాన్ని దుర్భరంగా మార్చుకోవద్దని సూచించారు.

ఇదిలా ఉండగా, ప్రజా భద్రత దృష్ట్యా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) మద్యం సేవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరలేని వారికి ఉచిత రవాణా సేవలు ప్రకటించింది. ఈ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 1 గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. ఏ వేడుకైనా ప్రాణాల కంటే గొప్పది కాదు అంటూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని యూనియన్ ప్రజలకు పిలుపునిచ్చింది.