
తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే.. వారం రోజులు ‘స్పెషల్ డ్రైవ్’: సీపీ సజ్జనార్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్లపై హంగామా సృష్టించి హద్దులు మీరిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచే న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ, భద్రతా ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్‌స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. డిసెంబరు 31 రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మద్యం మోతాదు మించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డెసిగ్నేటెడ్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్ సేవలను వినియోగించాలని సూచించారు. యువత రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
డిసెంబరు 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, డెసిబెల్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈవెంట్లలో మాదకద్రవ్యాల వినియోగం లేదా అశ్లీల నృత్యాలకు తావిస్తే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయని సీపీ వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని తక్షణమే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తూ, ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని కోరారు.
