
త్వరలో దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్ ’
దేశవ్యాప్తంగా కీలకమైన ఎస్ఐఆర్(సర్)ను ఈసీ త్వరలోనే చేపట్టనుంది. దాదాపు రెండు దశాబ్దాల కింద అంటే 2002–2004 మధ్య సర్ చేపట్టింది. ఉత్తరాఖండ్ లో 2006లో, న్యూఢిల్లీలో 2008 లో చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఓటరు జాబితా సమగ్ర సవరణ చేపట్టలేదు. ఇటీవల బీహార్ లో ఓటరు జాబితా సవరణ చేపట్టి పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను తొలగించింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపట్టడానికి సమాయత్తం అవుతోంది.
సెప్టెంబర్ 30 లోపు సన్నద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ కీలక ఆదేశాలిచ్చింది. ఇటీవల ఇదే అంశంపై ఢిల్లీలో రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో ఈసీ ముఖ్య సమావేశం నిర్వహించింది. రాబోయే 10 రోజుల్లో ఓటరు సమగ్ర సవరణకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఎటువంటి లోపాలు లేని పూర్తి ఓటరు జాబితాను రూపొందించనుంది. చివరిసారిగా చేపట్టిన ఓటరు సమగ్ర సవరణను వెబ్సైట్ లో ఉంచాలని ఆదేశాలిచ్చింది. ఆయా రాష్ట్రాల సీఈవోలు ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
2026 నాటికి అక్రమంగా ఉంటున్న వారిని తొలగిస్తాం
దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి, ఓటు హక్కు పొందిన వలసదారులను తొలగించడమే లక్ష్యంగా ఓటరు సమగ్ర సవరణను చేపట్టనున్నారు. వారి ధ్రువ పత్రాలను పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని ఈసీ తెలిపింది. 2026లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాం, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
