
త్వరలో ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా త్వరలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి సవితను ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వచ్చినందుకుగానూ మంత్రిని వారు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.
సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత తొలి విడతగా 83 మందికి సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు మరో బ్యాచ్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ బ్యాచ్ లో వందమంది వరకూ ఉంటారని తెలిపారు. అమరావతిలో అయిదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిందని, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ కూడా అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 270 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపిక కావడానికి కృషి చేసిన బీసీ స్టడీ సర్కిల్ సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి సవితకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
