
త్వరలోనే తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తుది ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మూడు దశల్లో పూర్తి కావడంతో అర్హుల తుది జాబితాను టీజీపీఎస్సీ సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రూప్-3 ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టేందుకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా, 2024 డిసెంబరులో జరిగిన రాత పరీక్షకు 2,49,964 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాల్లో చేసిన పొరపాట్ల కారణంగా 13,315 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను మార్చి 11న విడుదల చేశారు. పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, మూడు దశల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. చివరి దశ పరిశీలన ఈ నెల సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు జరిగింది.
మూడు దశల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో కమిషన్ నిమగ్నమైంది. అభ్యర్థులు సాధించిన మార్కులు, వారు ఇచ్చిన ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందించనున్నారు. త్వరలోనే ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
గ్రూప్-2 ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత కమిషన్ గ్రూప్-3 పరీక్షల తదుపరి దశపై దృష్టి సారించనుంది. గ్రూప్-3 కింద మొత్తం 1,388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, 2024 నవంబరులో జరిగిన రాత పరీక్షలకు 2,67,921 మంది హాజరయ్యారు. వీరిలో 18,364 మంది అభ్యర్థులను సాంకేతిక కారణాలతో అనర్హులుగా ప్రకటించగా, మిగిలిన 2,49,557 మందితో జనరల్ ర్యాంకు జాబితాను మార్చి 14న విడుదల చేశారు. వాస్తవానికి గ్రూప్-3 ధ్రువపత్రాల పరిశీలనను జూన్‌లో నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించారు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు గ్రూప్-2 తుది ఫలితాల ప్రక్రియ పూర్తైన తర్వాత గ్రూప్-3 ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడానికి టీజీపీఎస్సీ కార్యాచరణను రూపొందిస్తోంది.
