
త్వరితగతిన
గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మకమైన డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని గంటా చెప్పారు. అదనపు పరిహారం గురించి కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు చేసిన విజ్ఞప్తిని సీఎం దగ్గర ప్రస్తావించారు. రివిజన్ లో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు పెంచినప్పటికీ.. తర్లువాడ గ్రామంలో మార్కెట్ రేటు పెంపును వర్తింపజేయలేదని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి పరిహారం పెంపుపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే రైతుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి.. జీవనోపాధి కోసం వారికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి షాపులు ఇవ్వడానికి.. సుముఖత వ్యక్తం చేశారు. 2014- 29 లో భూ సేకరణ పరిహారం చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన గంభీరం ఐ.ఐ.ఎం. మాదిరి సెటిల్మెంట్ కావాలని తర్లువాడ రైతులు కోరుకుంటున్నారని వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ కోసం త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.
