
‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఆదివారం రాష్ట్ర శాసనసభ ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు, 2026’ (తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత)ను ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రజా ప్రతినిధులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ఈ చట్టం వర్తించడం విశేషం.
జీతంలో 15 శాతం కోత - నిబంధనలు ఇవే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం, ఎవరైనా తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి వేతనం నుంచి కొంత మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు. ఉద్యోగి నెలసరి వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కట్ చేసి బాధితులైన తల్లిదండ్రులకు అందజేస్తారు. ఈ చట్టం పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ప్రజా ప్రతినిధులు అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు కూడా వస్తారు. ఈ నిబంధన ద్వారా వృద్ధుల ఆర్థిక భద్రతను బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2007లో తీసుకొచ్చిన 'తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ చట్టం' కంటే ఈ కొత్త రాష్ట్ర చట్టం మరింత విస్తృతమైనది కఠినమైనదని ఆయన తెలిపారు.
విజయ్‌పత్ సింఘానియా ఉదంతాన్ని గుర్తుచేసిన సీఎం
బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌పత్ సింఘానియా ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. తన ఆస్తులన్నింటినీ కొడుకుకు రాసిచ్చిన తర్వాత, చివరకు ఆయనే రోడ్డున పడాల్సి వచ్చిన దుస్థితిని గుర్తుచేశారు. తల్లిదండ్రులు లేనిదే మనకు జీవితం లేదు. వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. సమాజంలో నైతిక విలువలను పెంచేందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే పిల్లలను చట్టం పరిధిలోకి తెచ్చేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టాం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి సమాజంలో జీవించే హక్కు లేదు అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటువంటి చట్టం తీసుకురావాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బంధాల కంటే ఆస్తులే మిన్నయా?
నేటి సమాజంలో మనిషి అనుబంధాలను మర్చిపోయి, కేవలం ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పేగు బంధాలను కూడా విస్మరిస్తున్నాడని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం ఉంది. అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో చట్టం (2012) ఉంది. విద్యా హక్కు చట్టం (2009) ఉంది. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని బాల కార్మిక చట్టం ఉంది. బాల్య వివాహాల నిషేధం చట్టం ఉంది. మహిళల రక్షణ కోసం నిర్భయ వంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం దురదృష్టకరం. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు.
విపక్షాల మద్దతు
ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వృద్ధుల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని, ఈ చొరవ తీసుకున్న సీఎంను అభినందిస్తున్నానని తెలిపారు. ఇది దేశంలోనే మొదటి రకమైన చట్టమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు. తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలుపుతూనే, కోత విధించే మొత్తాన్ని మరికొంత పెంచాలని సూచించారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా ఈ బిల్లును స్వాగతించారు. వృద్ధాప్యంలో ఆదరణ కరువైన వేలాది మంది తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక పెద్ద అండగా నిలవనుంది.
అసెంబ్లీలో 'హేట్ స్పీచ్, గిగ్ వర్కర్ల సంక్షేమం' బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
సమాజంలో చిచ్చు పెట్టే విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. "తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు, 2026" ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును సభ ముందు ఉంచారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, కర్ణాటక తర్వాత ఇటువంటి చట్టాన్ని తెచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
సమాజంలో అల్లర్లను, ఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడే వారిపై ఈ చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్వేష నేరానికి పాల్పడిన వారికి కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తారు. అదే వ్యక్తి రెండోసారి నేరానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారు.ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్ బెయిలబుల్ గా పరిగణించబడతాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో సమర్థవంతంగా లేవని, అందుకే ఈ ప్రత్యేక పటిష్ట చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. మార్చి 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
గిగ్ వర్కర్ల సంక్షేమానికి మరో ముందడుగు
హేట్ స్పీచ్ బిల్లుతో పాటు, రాష్ట్రంలోని సుమారు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు మొదలైనవారు) ప్రయోజనం కోసం "తెలంగాణ ప్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్, 2026" ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. కార్మికులందరికీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసి, వారికి సామాజిక భద్రత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 'సోషల్ సెక్యూరిటీ కోడ్'కు అనుగుణంగా ఈ బిల్లులో కొన్ని సవరణలు చేసి మరింత పటిష్టంగా రూపొందించారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటంతో పాటు, అసంఘటిత రంగ కార్మికులకు భద్రతను కల్పిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
