Let's talk: editor@tmv.in
తల్లిదండ్రులను వదిలేస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ స‌జ్జ‌నార్

తల్లిదండ్రులను వదిలేస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ స‌జ్జ‌నార్

Gaddamidi Naveen
17 డిసెంబర్, 2025

సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం, అమానుష ప్రవర్తన తనను తీవ్రంగా కలచివేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అనేక మంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకునేందుకు తనను సంప్రదిస్తున్నారని సీపీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించిన అనుభవంలోనూ, ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకే వాస్తవం తనను బాధిస్తోందన్నారు.

సీపీ మాట్లాడుతూ వృద్ధాప్యంలోకి చేరిన తల్లిదండ్రులను, అనారోగ్యంతో ఉన్న కన్నవారిని సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం ఎన్నోసార్లు తన దృష్టికి వచ్చిందని ఆయ‌న‌ చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం బిడ్డల కనీస ధర్మమని, అది చర్చలకు తావులేని మౌలిక హక్కు అని ఆయ‌న తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సాకులు, సమర్థనలు చెల్లవని ఆయ‌న‌ హెచ్చరించారు.

ఈ రోజు తల్లిదండ్రుల పట్ల మనం ప్రదర్శించే ప్రవర్తనే రేపు మన పిల్లలకు ఒక పాఠంగా మారుతుందని కమిషనర్ గుర్తు చేశారు. నేడు మనం ఏది విత్తామో, వృద్ధాప్యంలో అదే కోసుకుంటామని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవంతో, ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యతను ఆయ‌న‌ గుర్తించాలన్నారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, శారీరకంగా లేదా మానసికంగా హింసించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయ‌న‌ హెచ్చరించారు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయ‌న‌ తెలిపారు.

దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని కమిషనర్ భరోసా ఇచ్చారు. వృద్ధులు ఒంటరివారు కాదని, వారి ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు పోలీస్ శాఖకు అత్యంత ముఖ్యమని ఆయ‌న‌ చెప్పారు. ఎవరైనా బాధితులు భయపడకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులను వదిలేస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ స‌జ్జ‌నార్ - Tholi Paluku