
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శిల్పకళావేదిక, హైదరాబాద్‌లో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో పాల్గొని, కొత్తగా ఎంపికైన టీజీపీఎస్సీ గ్రూప్-II అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ జీతంలో 10 నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుందో.. అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్‌లో ఒకటో తేదీన పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం అని సీఎం అన్నారు. తాజాగా ఎంపికైన గ్రూప్-II ఉద్యోగుల నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా, ముఖ్యమంత్రి ఉద్యోగులను తమకు సమస్యలతో వచ్చే ప్రజల పట్ల దయతో వ్యవహరించాలని అభ్యర్థించారు. అలాగే అభ్యర్థులను ప్రేరేపిస్తూ, ముఖ్యమంత్రి ఈ రోజు మీకు వచ్చిన నియామక పత్రం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈరోజు నుంచి మీరు బాధ్యతగల ప్రభుత్వ అధికారులు. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కాపాడుతూ ముందుకు సాగాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినందున 100 ఏళ్లలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం యువతకు ఉన్న ప్రధాన బాధ్యత అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గ్రూప్-2లో ఎంపికైన వారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ల కుటుంబ సభ్యులు, బందు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని సీఎం పేర్కొన్నారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదని రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు.
