Let's talk: editor@tmv.in
తల్లికి వందనం అమలులో విద్యార్థులకు అన్యాయం: వైసీపీ నేత‌ రమేష్ గౌడ్

తల్లికి వందనం అమలులో విద్యార్థులకు అన్యాయం: వైసీపీ నేత‌ రమేష్ గౌడ్

Gaddamidi Naveen
18 జులై, 2026

తల్లికి వందనం పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో అమలు చేస్తూ అర్హులైన విద్యార్థులను దూరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఎలాంటి షరతులు లేకుండా పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన రమేష్ గౌడ్, పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఎవరూ చేపట్టని విధంగా ఈ పథకాన్ని అమలు చేసి పేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో కొనసాగిస్తున్నప్పటికీ, పథకం అసలు ఉద్దేశ్యాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదని, రెండో ఏడాది కూడా పరిమిత స్థాయిలో మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు.

యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున అందించాలంటే రూ.13,112 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. అయితే ప్రభుత్వం కేవలం 66 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తూ రూ.10,126 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం విద్యార్థులను వంచించడమేనని ఆయ‌న అన్నారు.

మూడేళ్ల కాలానికి ఈ పథకం కోసం సుమారు రూ.39 వేల కోట్లు అవసరమవుతాయని, ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు దాదాపు రూ.22 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. తల్లికి వందనం పథకాన్ని సాధారణ సంక్షేమ పథకంగా కాకుండా పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చే విద్యా విప్లవంగా చూడాలని ఆయన సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగితే వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయ‌న హెచ్చరించారు.

ట్యాగ్‌లు
YSRCPRameshGoudTallikiVandanamAmmaOdiYSJaganAndhraPradeshAPPoliticsEducationForAllStudentWelfareEducationRightsPoorStudents
తల్లికి వందనం అమలులో విద్యార్థులకు అన్యాయం: వైసీపీ నేత‌ రమేష్ గౌడ్ - Tholi Paluku