
తలసేమియా రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి దామోదర్
తెలంగాణను దేశంలోనే తొలి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం అన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని కమల హాస్పిటల్‌లో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏసియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వచ్చిన వైద్యులు, నిపుణులు, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన సమస్యలు మాత్రమే కాదని, అవి బాధిత కుటుంబాలను జీవితాంతం ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక సవాళ్లని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య జరిగే వివాహాలు (మేనరికం) వల్ల ఈ జన్యుపరమైన వ్యాధులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే ముందస్తు స్క్రీనింగ్, సరైన కౌన్సిలింగ్, విస్తృత సామాజిక అవగాహన కల్పించడమే ఈ వ్యాధుల నివారణకు కీలకమని, నివారణే ఉత్తమ చికిత్స అని ఆయన తెలిపారు.
ఈ వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రతి గర్భిణీకి పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలు సాధించామని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తలసేమియా పేషెంట్లకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు డే కేర్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటివల్ల పేషెంట్లకు మరింత సమీపంలోనే నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా సికిల్ సెల్ వ్యాధి గుర్తింపులో భాగంగా ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో ఉచిత చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ హెల్త్ విజన్ 2047లో భాగంగా ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, అవసరమైతే అదనపు టెస్టులను కూడా ఫ్రీగా చేయించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
నివారించగలిగే వ్యాధులతో ఏ చిన్నారి పుట్టకూడదని, అనారోగ్యం కారణంగా ఏ కుటుంబం పేదరికంలోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిషన్ తలసేమియా ఫ్రీ తెలంగాణ లక్ష్యాన్ని సాధించి, దేశంలోనే తలసేమియా పేషెంట్లు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలపుద్దామని ఆయన పిలుపునిచ్చారు.
