Let's talk: editor@tmv.in
తెలుగు పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమం

తెలుగు పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమం

FL - YUGDR
20 సెప్టెంబర్, 2025

తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం, మాట తప్పిందని, అందుకే ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధమై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుగు దండు వ్యవస్థాపకుడు పరవస్తు సూరి తెలిపారు. మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహానికి నీరాజనాలు అర్పించిన ఆయన, ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అమరావతికి వెళ్లి అసెంబ్లీ వద్ద గాంధేయ మార్గంలో నిరసనల ద్వారా ఏలికల మనసుల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ ఉద్యమంలో అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఇలానే వదిలేస్తే భవిష్యత్ తరాలకు అప్పట్లో తెలుగు ఉండేది అని చెప్పే పరిస్థితి వస్తుందని, దాని వల్ల పూర్తిగా మన సంస్కృతి నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో ప్రాథమిక విద్యా బోధన, పదో తరగతి వరకూ ప్రథమ భాషగా, ఆ తర్వాత ద్వితీయ భాషగా తెలుగు బోధన, మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు, తెలుగు ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు, గౌరవం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. పాలనా వ్యవహారాలు తెలుగులో సాగేలా చొరవ చూపడం ప్రభుత్వ బాధ్యత అని, ఇవి గుర్తు చేయాల్సి రావడం, వాటి కోసం పోరాడాల్సి రావడం విచారకరమని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు తెలుగుకు పెద్ద పీట వేసే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విద్యార్థులు, సాహితీవేత్తలు చిన్న సూర్యనారాయణ, కేవీఎస్ మూర్తి, అడపా రామకృష్ణ, చేబియ్యం మోహన్, అరసం శ్యామసుందర్, అప్పలరాజు, ఆచార్య సూరప్పడు, కళాకారులు హేమా,నాంచారయ్య,భాషాభిమానులు రాజమన్నార్, సురేశ్, శ్రీధర్, మారుతీ రాం తదితరులు పాల్గొన్నారు.

తెలుగు పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమం - Tholi Paluku