
తెలుగును బతికించండి మహాప్రభో!
తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యాబోధనకు పెద్దపీట వేసి, ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని ‘తెలుగు దండు’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో గాంధేయ మార్గంలో సాగే మాతృభాష పరిరక్షణ ఉద్యమ ఉధృతిని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విశాఖపట్నంలోని తెలుగు దండు కార్యాలయంలో సోమవారం ఉదయం తెలుగు భాషాభిమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ, ‘తెలుగుభాషను అవమానించిన, నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాన్ని ఈ తెలుగునేల పొరపాటున కూడా క్షమించలేదు. మెడపట్టిమరీ బయటకు గెంటివేసింది. ఇది చరిత్ర’ అన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ, తెలుగుభాష రక్షణ విషయంలో తీయగా కబుర్లు చెబుతుందే కానీ చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో జరగాలని ఎన్నో ఏండ్లుగా మేధావులు, భాషాభిమానులు, భాషోద్యమకారులు చేస్తున్న ఎన్నో అభ్యర్థనలను తోసిరాజని, ఈ కూటమి తరఫున ప్రభుత్వం.. ఆంగ్లభాష అమలుకే మొగ్గు చూపిస్తూ, విద్యను, వైద్యాన్ని తెలుగుబిడ్డలకు దూరం చేస్తూ, రాష్ట్రాన్ని తెగ ఉద్ధరిస్తున్నట్లు నటిస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం తెలుగుభాషను దుంపనాశనం చేసిందని కబుర్లు చెప్పిన తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలోకి రాగానే తెలుగు ద్వేషంగా మారిపోయి, ఆంగ్లంలో విద్యను అమలుచేయడానికి నిస్సిగ్గుగా కంకణం కట్టుకుందని తెలుగుదండు సభ్యులు ఎద్దేవా చేశారు. తెలుగునాట ఆంగ్లభాషకు పెద్దపీట వేయడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించిన తెలుగు దండు, అసెంబ్లీ సమావేశాలలో చర్చించి, ‘మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ’ను ఏర్పాటు చేసి, తెలుగు భాష రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని, ప్రాథమిక విద్యాబోధన కచ్చితంగా తెలుగులోనే జరిగేలా అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపారు.
ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, సంక్షేమ పథకాలు, అమరావతి... ఇలా పలు అంశాల్లో కూటమి ప్రభుత్వం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని తెగ విమర్శించారని, అధికారంలోకి వచ్చి ఏదో వెలగబెడతారనుకుంటే... అంతా ఆ తాను ముక్కలే అని నిరూపించారని తెలుగు దండు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా తెలుగుభాషను మా తెలుగు బిడ్డలకు దూరం చేయకండి మహాప్రభో!’ అని మనవి చేస్తున్నామని తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వెళతామని, అసెంబ్లీ ప్రాంగణం ముందే తెలుగుభాష రక్షణ గురించి కూటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొంటామని, వందలాది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, భాషోద్యమకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారని తెలుగుదండు ఆధ్వర్యవంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకూ అక్కడే ఉంటామని, తెలుగుభాష రక్షణకు కూటమి ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా ప్రకటించేంతవరకూ అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసనలు తెలియజేస్తూ ఉంటామని సంకల్పం చెప్పుకొన్నారు. ఈ సమావేశంలో వేదుల కామేశ్వర శర్మ, సిహెచ్. చిన సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
