
తెలంగాణ జిల్లాలకు జల సంచయ్ అవార్డులు
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న "జల సంచయ్ , నీటి భాగి దారి జాతీయ అవార్డులు 2024 పోటీల్లో తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. దక్షిణ భారత జోన్ నుంచి నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందింది. నల్గొండతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు కూడా ఈ గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డులు తెలంగాణకు గర్వకారణమైన క్షణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలకు కేంద్రం ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతిని అందజేసినట్లు తెలిపారు. జల సంరక్షణ, జన భాగస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాల మధ్య పోటీలు నిర్వహించి ఈ అవార్డులు ప్రకటించినట్లు తెలిపారు.
నీటి మూలాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువుల అభివృద్ధి, శాశ్వత నీటి భద్రతకు తీసుకున్న చర్యలు, ప్రజల చొరవతో కార్యక్రమాల అమలు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో నల్గొండ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పంటలకు తగిన స్థాయిలో నీటి వాడకం, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, వాన నీటి నిల్వ కార్యక్రమాలను ప్రజల సహకారంతో చేపట్టినట్లు అనేక చర్యల ద్వారా ఈ గుర్తింపు సాధ్యమైంది. ప్రజల చొరవ, స్థానిక అధికారుల ప్రణాళికా దృష్టి, సామూహిక శ్రమదానం మరింత ప్రేరణ కలిగించే విధంగా నిలిచాయి. గ్రామీణాభివృద్ధిలో నీటి ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా వ్యవహరించడం ఈ విజయానికి మూలకారణంగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల్ జిల్లాలకు జాతీయ అవార్డు పొందడం రాష్ట్రానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. జల సంచయ్ ,నీటిభాగి దారి లక్ష్యం నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వర్షపు నీటిని సేకరించడానికి, నీటి సంబంధిత నిర్మాణాలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, సేవా సంస్థలకు, చొరవ చూపిన ప్రతి ఒక్కరికి మంత్రి కోమటిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు జిల్లాకు గౌరవంతో పాటు, రాష్ట్రానికి, దేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.
