Let's talk: editor@tmv.in
తెలంగాణ ఊపిరి పీల్చుకున్న వేళ

తెలంగాణ ఊపిరి పీల్చుకున్న వేళ

Aravind Maryada Reddy
17 సెప్టెంబర్, 2025

తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17. రజాకార్ల ఉక్కు పిడికిలి నుంచి విముక్తి పొందిన రోజు. దొరల గడీల పాలన అంతమైన రోజు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఎంత ప్రత్యేకత ఉందో.. తెలంగాణ ప్రజల పోరాటాలకు అంతే ఖ్యాతి ఉంది. నిజాం నవాబును, ఆయన అనుయాయులైన దొరలు, దేశ్ ముఖ్లను ఇక్కడి ప్రజలు ఎదురించారు. రజాకార్ల దురాగతాలకు చరమగీతం పాడారు. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. తమ నెత్తుటితో ఈ నేలను తడిపారు. చివరకు ఆపరేషన్ పోలో నిర్వహించి అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభబాయి పటేల్ ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించారు. అయినప్పటికీ ప్రజల పోరాటం ఆగలేదు. సాయుధులై భూమి హక్కుల కోసం పోరాడారు. యావత్ భారతదేశానికి ఆగస్ట్ 15, 1947న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్య్రం వచ్చింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్ రాష్ట్రంలో ఆ నాడు ఏం జరిగింది? అన్న అంశాలను ఈ కథనంలో మననం చేసుకుందాం.

గాయాల చరిత్ర

తెలంగాణ బిడ్డలది ( నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలది) గాయాల చరిత్ర. 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జాతీయ పతాకం ఎగిరి, ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉండిపోయాయి. అందులో హైదరాబాద్ రాష్ట్రం ఒకటి. నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన హైదరాబాద్ రాజ్యాన్ని 'సార్వభౌమ సామ్రాజ్యం'గా ప్రకటించాడు. ఈ నిర్ణయం ఇక్కడి ప్రజల రక్తం మరిగేలా చేసింది. అప్పటికే నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జనం.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. మరోవైపు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం సమాంతరంగా కొనసాగింది. హైదరాబాద్ రాజ్యం ఈ పోరాటానికి అణిచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి.. అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. దీంతో రజాకార్లు రెచ్చిపోయారు. తెలంగాణ ప్రజలను పీడించారు. గ్రామాల్లో నెత్తుటి ఏరులు పారించారు. ఆ దురాగతాలపై తెలంగాణ బిడ్డలు తిరగబడ్డారు.

ఎంతకష్టం.. ఎంత నష్టం

రజాకార్ల క్రౌర్యంతో తెలంగాణ బిడ్డలు నలిగిపోయారు. గ్రామీణ భూములు జాగీర్దార్ల చేతుల్లో ఉండటం, వెట్టి చాకిరీ, అధిక పన్నులు ప్రజలను పీల్చి పిప్పి చేశాయి. దీంతో అప్పటి నిజాం నవాబు, దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్ర మహాసభ (ఏఎంఎస్) ద్వారా ప్రారంభమైన ఈ ఉద్యమం, రావి నారాయణ రెడ్డి, రాజేశ్వర రావు వంటి నాయకులు నడిపారు. గ్రామాల్లో భూస్వాములపై దాడులు, భూముల ఆక్రమణలు, స్త్రీల హక్కుల కోసం పోరాటాలు ఈ ఉద్యమానికి ఆకారం ఇచ్చాయి. ఈ పోరాటం, కేవలం భూమి సంస్కరణకు మాత్రమే కాక, నిజాం అణచివేతకు వ్యతిరేకంగా ఒక సామాజిక విప్లవంగా మారింది.

రజాకార్ల సైన్యం ఎప్పుడు మొదలైంది?

నిజాం పాలనలో 1938లోనే ఖాసీం రజ్వీ రజాకార్లతో ప్రత్యేకంగా ఓ సైన్యం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వంలో కలపొద్దన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ ఈ సంస్థ హింసాత్మక చర్యలకు పాల్పడింది. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం 'ఆపరేషన్ పోలో' (పోలీసు చర్య) ప్రారంభించిన తర్వాత.. రజ్వీ ఈ బలగాలను గ్రామాల్లో విస్తరించాడు. హింసాత్మక ప్రతిఘటనల ద్వారా ప్రజలను భయపెట్టి, భారత విలీనాన్ని వ్యతిరేకించడంమే లక్ష్యంగా కొనసాగింది. కొన్ని గ్రామాల్లో స్త్రీల మీద లైంగిక హింసకు పాల్పడటం.. నగ్నంగా బతుకమ్మలు ఆడించడం వంటి దుశ్చర్యలకు కూడా ఈ సంస్థ పాల్పడ్డట్టు చరిత్ర కారులు చెబుతున్నారు. ప్రజల డబ్బులు దోచుకున్నారు. జజియా (ఇస్లామిక్ పన్ను) వసూలు చేశారు. వ్యతిరేకించిన వారిని అమానుషంగా హత్య చేశారు. సుందర్లాల్ కమిటీ నివేదిక ప్రకారం, రజాకార్లు దాదాపు రూ. 100 కోట్ల విలువైన దోపిడీలు చేశారు. ఈ హింసలు ముఖ్యంగా హిందువులపై, కమ్యూనిస్టులపై, గ్రామీణ కార్మికులపై జరిగినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ దుర్మార్గాలు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న మరాఠీ, కన్నడ ప్రాంతాల్లో కూడా వ్యాపించాయి. ఒస్మానాబాద్, నందేడ్, గుల్బర్గా, బీదర్లలో ముస్లిం మైనారిటీలపై కూడా కొన్ని సందర్భాల్లో హింస జరిగింది. కానీ ప్రధానంగా రజాకార్లు 'అంధ్ర మహాసభ' సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు.

రజాకార్ల దురాగతాలు

రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో భయానకమైన దురాగతాలు చేశారు. వీరు హిందూ జనాభా అధికంగా ఉన్న గ్రామాలపై దాడులు చేసి, సామూహిక హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు సాగించారు. నిజాం పోలీసుల సహాయంతో వీరు రైతులు, కమ్యూనిస్టులను హింసించారు. 1948 ఆగస్టులో రజాకార్లు బైరాన్పల్లి అనే గ్రామంపై దాడి చేసి, 118 మందిని చంపి, మహిళలపై అత్యాచారాలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. అక్కడి ప్రజలు తిరగబడ్డందుకు 1948 సెప్టెంబర్ 1న గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజలను వృత్తాకారంలో నిలబెట్టి కాల్చి చంపారు. మహిళలను పొలాల్లో వెంబడించి లైంగికహింసకు పాల్పడ్డారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న గోరట గ్రామంలోనూ రజకార్లు ప్రజలను దారుణంగా చంపేశారు. అక్కడి ప్రజలు జాతీయ జెండాను ఆవిష్కరించడంతో రజాకార్లు ఊచకోతకు సిద్దపడ్డారు. 1948 మే 9న 200 మందికి పైగా గ్రామవాసులను చంపారు. అక్కడి ప్రజలు రజకార్ల కమాండర్ ను చంపిన చరిత్ర కూడా ఉంది. రజాకార్ల దుర్మార్గాల వల్ల మొత్తం 2,000 మందికి పైగా చనిపోయారు. వందలాది మహిళలు లైంగికహింసకు గురయ్యారు.

జనం తిరుగుబాటు

రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అప్పటి నిజాం అన్యాయానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ నాయకత్వంలోని రైతుల తిరుగుబాటు మొదలైంది. 1946 నుంచి 1951 వరకు సాయుధ తెలంగాణ పోరాటం సాగింది. 1946 జూలై 4న వరంగల్ జిల్లాలోని కడవెండి గ్రామంలో రైతు నాయకుడు దొడ్డి కొమరయ్య హత్య తర్వాత ఈ తిరుగుబాటు తీవ్రమైంది. రైతులు భూములు స్వాధీనం చేసుకుని, పన్నులు చెల్లించకుండా, గెరిల్లా యుద్ధం చేశారు. చండ్ర రాజేశ్వర రావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, స్వామి రామానంద తీర్థ ఆంధ్ర మహాసభ ద్వారా సంఘటితమయ్యారు. 1948 నాటికి 4,000 గ్రామాల్లో 'గ్రామ రాజ్యాలు' ఏర్పడ్డాయి. ప్రజలు సాంప్రదాయ ఆయుధాలతో రజాకార్లను ఎదుర్కొన్నారు. వీర బైరన్పల్లిలో మూడుసార్లు రజాకార్ల మీద ప్రజలు తిరగబడ్డారు.

ఆపరేషన్ పోలో ఎలా జరిగింది?

సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం, 1948 సెప్టెంబర్ 13న 'ఆపరేషన్ పోలో' చేపట్టింది. ఐదు రోజుల్లోనే, భారత సైన్యం హైదరాబాద్ను ఆక్రమించి, సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయి, భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ చర్య, 'పోలీసు చర్య'గా పిలువబడినప్పటికీ, పూర్తి సైనిక చర్యగానే కొనసాగింది. ఫలితంగా, హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఆపరేషన్ పోలో తర్వాత, హింసాత్మక ప్రతీకారాలు మొదలయ్యాయి. ఆపరేషన్ పోలో తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ తెలంగాణ పోరాటం కొనసాగింది.

కమ్యూనిస్టుల సాయుధ పోరాటం

నిజాం పాలన, రజాకార్ల దాడులను అరికట్టడానికి తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం మొదలైంది. ఇది ఒక ప్రజల ఉద్యమంగా మారింది. గ్రామాల్లో ప్రజలు, రైతులు, కార్మికులు ఏకమై దొరల గడీలను ధ్వంసం చేశారు. వారి భూములను లాక్కుని, పేదలకు పంచారు. రజాకార్ల దాడులను ఎదుర్కొంటూ తమ గ్రామాలను తామే కాపాడుకున్నారు. ఈ పోరాటం వలన లక్షలాది ప్రజలకు ధైర్యం వచ్చింది. నిజాం సైన్యానికి, రజాకార్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం తీవ్రరూపం దాల్చింది. నిజాం పాలన అంతానికి, భారతదేశంలో విలీనానికి ఈ సాయుధ పోరాటం ఎంతో తోడ్పడింది.

కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి?

1946-1951 వరకు సాయుధ తెలంగాణ పోరాటం సాగింది. ఆ పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. నిజాం పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకులు కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం ద్వారా వారు ప్రజలను చైతన్యవంతులను చేసి, భూమి పంపిణీ, వెట్టి చాకిరీ నిర్మూలన వంటి సంస్కరణలకు పునాది వేశారు. అయితే, భారత సైన్యం జోక్యం తర్వాత ఈ ఉద్యమం అంతమైపోయింది. 1940లో తెలంగాణలో నిజాం పాలనలో రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. భూస్వాములు వెట్టి చాకిరీ, అధిక కౌలు, భూమి ఆక్రమణలు వంటి అన్యాయాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ ద్వారా ఉద్యమాన్ని నడిపించారు. రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ వంటి నాయకులు రైతులను సంఘటితం చేశారు. వారు 'దళాలు' (20-30 మంది పార్టీ కార్యకర్తలు) ఏర్పాటు చేసి, గ్రామాల్లో గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించారు. ఈ పోరాటంలో మహిళలు, గిరిజనులు కూడా పాల్గొన్నారు. కమ్యూనిస్టులు దాదాపు 300-400 గ్రామాల్లో ఆధిపత్యం సాధించి, భూమిని పంచి పెట్టారు. ఈ ఉద్యమం నిజాం రజాకార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటుగా మారింది.

ఉద్యమం విరమణ

భారత స్వాతంత్ర్యం తర్వాత, 1948లో భారత ప్రభుత్వం 'పోలీస్ యాక్షన్' (ఆపరేషన్ పోలో) ద్వారా హైదరాబాద్ను ఆక్రమించింది. అయితే, కమ్యూనిస్టులు తమ పోరాటాన్ని కొనసాగించారు. భారత సైన్యం దాడులు, అణచివేతలు తీవ్రమవడంతో ఉద్యమం బలహీనపడింది. సీపీఐ నాయకత్వం 1951లో సాయుధ పోరాటాన్ని ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయానికి అంతర్గత చర్చలు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం, భారత ప్రభుత్వం ఒత్తిడి కారణాలు. తర్వాత కమ్యూనిస్టులు పార్లమెంటరీ రాజకీయాల వైపు మళ్లారు. 1952 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఉద్యమం అంతమైనా, దాని ప్రభావం తెలంగాణలో భూసంస్కరణలకు దారితీసింది. మొత్తంగా సెప్టెంబర్ 17కు ఎంతో ప్రత్యేకంగా ఉంది. సర్దార్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో, కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం వల్ల తెలంగాణ ప్రజలు పీడన నుంచి విముక్తి పొందారు. ఈ ఉద్యమంలో ఎవరి పాత్రను తక్కువ చేయలేం.

తెలంగాణ ఊపిరి పీల్చుకున్న వేళ - Tholi Paluku