
తెలంగాణలో 3,745 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిలో మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మంత్రివర్గ ఉపసమితి మూడు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల రూ. 3,745 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,518 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షత వహించారు. ఈ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం లో జరిగింది.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం విశ్వవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందన్నారు. ఇందులో ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ పాలసీలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయని. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల మరింత పెరుగుతుందని తెలిపారు.
ఆమోదం పొందిన మూడు ప్రధాన పెట్టుబడి ప్రాజెక్టులు:
హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిద్దిపేట జిల్లాలో రూ.2,398 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇది సుమారు 600 ఉద్యోగాల అవకాశాలు సృష్టించనుందని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ మామిడి, కమలపండు వంటి పండ్ల డిమాండ్‌ను గణనీయంగా పెంచి స్థానిక రైతులకు నేరుగా లాభాలు అందిస్తుందని తెలిపారు. జేఎస్ డబ్ల్యూ సంస్థ మహేశ్వరం లో డ్రోన్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తూ రూ.785 కోట్లు పెట్టుబడి ద్వారా టెక్నాలజీ రంగంలో తెలంగాణ ముందంజ వేసేలా చేస్తుందని భావించారు. యువతకు ఉద్యోగాలు కలుగబోతాయని అంచనాలుగా పేర్కొన్నారు.
టోషిబా ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ సంస్థ గ్యాస్ ఇన్‌సులేటెడ్ స్విచ్గీయర్ మరియు బుషింగ్స్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ.562 కోట్ల పెట్టుబడి, ద్వారా 554 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల డావోస్‌లో జరిగిన ఆర్థిక సమ్మేళనంలో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై కూడా సమీక్ష జరిగిందని. అంతర్జాతీయంగా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
