Let's talk: editor@tmv.in
తెలంగాణలోనూ ఓ ట్రంప్!

తెలంగాణలోనూ ఓ ట్రంప్!

Aravind Maryada Reddy
20 సెప్టెంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. కేసీఆర్ కూడా ట్రంప్ లాంటి వాడేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని.. అందుకే ఆయనను ప్రజలు గద్దె దించారని విమర్శించారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చారు.

'విజన్ తెలంగాణ రైజింగ్ 2047' అంశంపై మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడానికి ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్న సీఎం, అమెరికాలో ట్రంప్ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్న సంస్థలు తెలంగాణలోకి రావాలని పిలుపునిచ్చారు.

'విజన్ తెలంగాణ రైజింగ్ 2047' అంశంపై మాట్లాడుతూ.. "తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారు. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్లు ఎవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు" అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ పాలనను ఉద్దేశించి పరోక్షంగా చేయడం గమనార్హం. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకే నష్టం కలిగించాయని, అలాంటి సంస్థలు (హార్వర్డ్, స్టాన్ఫోర్డ్) ఇండియాకు, ముఖ్యంగా తెలంగాణకు రావాలని సీఎం కోరారు.

"అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి" అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఉంది. భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే మా ఆలోచన అని, తెలంగాణ దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అని పేర్కొన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పుకున్నారు.

అభివృద్ధి విజన్

సదస్సులో అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించిన సీఎం కోటి మంది ప్రజలు అర్బన్ ఏరియాల్లో నివసిస్తున్నారని, సెమీ-అర్బన్ ప్రాంతాలను మాన్యుఫాక్చరింగ్ జోన్‌లుగా మార్చామని తెలిపారు. 150 కి.మీ. మెట్రో రైలు సెకండ్ ఫేజ్, మూసీ రివర్ డెవలప్‌మెంట్, ఎలివేటెడ్ కారిడార్లు, టెంపుల్-మసీదు-చర్చి-గురుద్వారాలతో కల్చరల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టామని చెప్పారు.

2027 నాటికి హైదరాబాద్‌లో ఈవీ వెహికల్స్ పూర్తిగా రానున్నాయని, దానికి రాయితీలు ప్రకటించామని చెప్పారు. "తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది" అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. కాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇంకా కేసీఆర్ ఫోబియాతో బాధపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి చాలా రోజులుగా కేసీఆర్‌ను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కూడా ఆయన రేవంత్ రెడ్డి మీదే మాటల దాడి చేశారు.

‘హైదరాబాద్‌లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీని కోసం మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్‌ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నారు. 2034 కల్లా ట్రిలియన్‌ డాలర్ల, 2047 కల్లా మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారాలనేది మా లక్ష్యం. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీ ఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు.

విద్య, గ్రీన్ ఎనర్జీ, వినోద పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి (మెట్రో, పట్టణ రవాణా) మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఫార్మా రంగాలు సహా రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రాధాన్యతలను పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యూజెర్సీ ప్రథమ మహిళ టామీ మర్ఫీతో పాటు న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలోనూ ఓ ట్రంప్! - Tholi Paluku