Let's talk: editor@tmv.in
తెర వెనుక చిక్కుతున్న.. బాల్యం

తెర వెనుక చిక్కుతున్న.. బాల్యం

T Venkata Ramana
16 సెప్టెంబర్, 2025

ఒకప్పుడు పిల్లల నవ్వులు అమాయకపు మాటలతో కళకళలాడిన సమాజంలో నేడు ఆందోళనకరమైన నిశ్శబ్దం ఆవరించింది. పసి హృదయాల్లో మొలకెత్తాల్సిన మానవతా విలువలు, ప్రేమ, కరుణ స్థానంలో నేర ప్రవృత్తి, హింస, ద్వేషం వంటి విష బీజాలు పడుతున్నాయి. చేతిలో పుస్తకాలు ఉండాల్సిన వయసులో కొందరు పిల్లలు కత్తులు పడుతున్నారు, ఆటపాటలతో గడపాల్సిన సమయంలో మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్నారు. పాఠశాలలకు వెళ్లాల్సిన వారు బాల నేరస్థుల సంరక్షణ గృహాలకు (జువైనల్ హోమ్స్) చేరుతున్నారు. ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న పెను సవాలు. ఈ ప్రమాద ఘంటికలకు కారణాలేంటి? పరిష్కార మార్గాలేవి? అసలు ఎందుకిలా జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేమా

బాలల నేరాలు

పిల్లలు నేరాల వైపు ఆకర్షితులు కావడానికి ఒక్క కారణమని చెప్పలేం. కుటుంబ, సామాజిక, సాంకేతిక అంశాలు కలగలిసి వారి బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. పిల్లల ప్రవర్తనకు వ్యక్తిత్వానికి పునాది పడేది కుటుంబంలోనే. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఆర్థిక అవసరాల కోసం ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో పిల్లలు ఒంటరితనానికి గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య నిరంతర గొడవలు, ప్రేమ, ఆప్యాయతల కొరవడటం, పిల్లల ప్రతీ కోరికను డబ్బుతో తీర్చాలనుకోవడం వంటివి వారిని మానసికంగా బలహీనపరుస్తున్నాయి. ఇంట్లో సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో వారు బయటి ప్రపంచంలో తప్పుడు మార్గాలను సులభంగా ఎంచుకుంటున్నారు.

చెడుకు దారితీస్తున్నస్మార్ట్ఫోన్లు

సాంకేతికత ఒక వరం కానీ అదే సమయంలో పిల్లల పాలిట శాపంగా మారుతోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ రూపంలో ప్రపంచం వారి చేతుల్లోకి వచ్చింది. కానీ దానిని ఎలా వాడుకోవాలో చెప్పే పర్యవేక్షణ కొరవడింది. హింసను ప్రోత్సహించే ఆన్లైన్ గేమ్స్, అశ్లీల వెబ్సైట్లు, సైబర్ బుల్లీయింగ్ వంటివి వారి సున్నితమైన మనసులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. వాస్తవ ప్రపంచంలోని సంబంధాల కంటే వర్చువల్ ప్రపంచానికే ఎక్కువ విలువిస్తూ సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు.

స్నేహితుల ప్రభావం

నీ స్నేహితుడెవరో చెబితే నీవెలాంటివాడివో చెబుతాను అనే సామెత ఎప్పటికీ నిజం. ముఖ్యంగా కౌమారదశలో పిల్లలు తల్లిదండ్రుల కంటే స్నేహితుల మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చెడు స్నేహాల బారిన పడి దురలవాట్లకు దగ్గరవుతున్నారు. సిగరెట్లు, మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి వాటిని కొనడానికి డబ్బుల కోసం దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు.

పరుగుల ప్రపంచంలో

నేటి విద్యావ్యవస్థ పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ర్యాంకులు, మార్కుల కోసం సాగే పోటీలో వారి బాల్యం నలిగిపోతోంది. తోటి విద్యార్థులతో పోలిక, తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోవడం వంటివి వారిలో తీవ్రమైన ఆందోళన నిరాశను నింపుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు హింసాత్మక ప్రవర్తన ద్వారా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.

తల్లిదండ్రులే స్నేహితులు కావాలి

పిల్లలకు విలువైన వస్తువులే కాదు తల్లి తండ్రులు వారికి సమయం ఇవ్వకుండా స్మార్ట్ఫోన్లు చేతికిస్తే వారి బాల్యం డిజిటల్ తెరల వెనుక బందీ అవుతుంది. కుటుంబ బంధాలు బలహీనపడటమే పిల్లలు పెడదారి పట్టడానికి ప్రధాన కారణం. తల్లిదండ్రులు స్నేహితుల్లా మారి వారి భావాలను అర్థం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.పిల్లలను సరైన మార్గంలో పెట్టడం కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యం.

తల్లిదండ్రుల పాత్ర

పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడపాలి. వారు చెప్పేది ఓపికగా వినాలి. వారి ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలి. అన్నింటికంటే ముఖ్యంగా వారికి మంచి రోల్ మోడల్గా నిలవాలి.

పాఠశాల, కళాశాలల్లోనూ కేవలం పాఠ్యాంశాలే కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను బోధించాలి. ప్రతి పాఠశాలలో విద్యార్థుల మానసిక సమస్యలను గుర్తించేందుకు నిపుణులైన కౌన్సెలర్లను నియమించాలి. క్రీడలు, కళలను ప్రోత్సహించాలి. బాలలకు మాదకద్రవ్యాలు, మద్యం అమ్మే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హింస, అశ్లీలతను ప్రోత్సహించే కార్యక్రమాలపై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి.

తెర వెనుక చిక్కుతున్న.. బాల్యం - Tholi Paluku