
తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
తిరుమలలో భక్తుల సేవల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక "ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్" ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి ప్రారంభించారు. భక్తుల రద్దీ, భద్రత, ట్రాఫిక్, పరిశుభ్రత వంటి సేవల పర్యవేక్షణకు ఈ సెంటర్ కీలకంగా మారనుంది. తిరుమలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
ఇది దేశంలోనే తొలి అత్యాధునిక ఏఐ ఆధారిత భక్తుల పర్యవేక్షణ కేంద్రం అని అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, ప్రవాస భారతీయుల సహకారంతో దీన్ని రూపొందించారు. ఈ సాంకేతిక కేంద్రం భక్తుల రద్దీ, భద్రత, పరిశుభ్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా చూసుకుంటుంది. ఈ కేంద్రం ద్వారా ఆలయ పరిధిలో 6,000కు పైగా ఏఐ కెమెరాలు పని చేస్తున్నాయి. ఇవి ప్రతి నిమిషం సమాచారాన్ని విశ్లేషించి, రోజుకు కోటిన్నరకి పైగా డేటాను ప్రాసెస్ చేస్తాయి. భక్తుల రాకపోకలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, నిఘా వ్యవస్థలన్నీ ఒకే చోట చేరి సమర్థవంతంగా పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఆధునిక వ్యవస్థతో ఆలయ నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు. భవిష్యత్‌లో దేశంలోని ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాలకు కూడా ఇదే విధంగా సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ చేసే అవకాశం ఉంది.
