
తురకపాలెం తాగునీటిలో యురేనియం అవశేషాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన గుంటూరు జిల్లా తురకపాలెం అనూహ్య మరణాల వెనుక కారణాలు వెతికేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తురకపాలెంలో ఆరేడు నెలల కాలంలోనే దాదాపు 45 మందికి పైగా మరణించడం సంచలనాత్మకం అయింది. కొద్దిపాటి జ్వరం రావడం.. అంతలోనే శరీరంలోని రోగనిరోధక శక్తి క్షీణించడం.. చనిపోవడం జరుగుతోంది. కొందరు ఇతరత్రా కారణాలతో గాయాల పాలైనా సరే ప్రాణాలు కోల్పోయారు. కొందరు కాళ్ళు విరిగి ఆస్పత్రిలో చేరి చనిపోయారు. దీంతో ఇక్కడ అంతుపట్టని అనారోగ్యం ఏదో ఉందని రాష్ట్రం భావిస్తోంది. ఇప్పటికే ఇక్కడి ప్రజల రక్తనమూనాలు సేకరించారు. నీటిని కూడా సేకరించి పరీక్షలు చేశారు.
అయితే ఈ నీటిని చెన్నైలోని ఓ సంస్థలో పరీక్షించగా అందులో విభ్రాంతికర ఫలితాలు కనిపించాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడి తాగునీటిలో యురేనియం అనే ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థపు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు ప్రమాదకరమైన స్ట్రాన్షియం, ఈకొలి బ్యాక్టీరియా ఉన్నాయంటున్న చెన్నై నిపుణులు క్వారీ గుంతల్లోని నీటిని తాగునీటిగా వినియోగించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. ఆ నీటిలో ఈకోలీ వంటి ప్రమాదకరమైన బాక్టీరియా ఉందని గుర్తించిన నిపుణులు.. ఇక్కడి పరిస్థితులపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్య, శాస్త్రవేత్తల బృందం అక్కడి నీరు, మట్టి, రోగుల రక్త నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పరిశీలించింది. ఈ శాంపిళ్లను చెన్నై, మంగళగిరి ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగశాలలకు పంపారు. చెన్నై ప్రయోగశాల విడుదల చేసిన నివేదిక ప్రకారం, తురకపాలెం పరిసర ప్రాంతాల్లోని నీటిలో యురేనియం, స్ట్రాన్షియం, ఈకొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇది గ్రామస్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి ప్రాణాలు తీస్తోందని వారి నివేదికలో పొందుపర్చారు.
యురేనియం అవశేషాలు చాలా ప్రమాదకరమైనవని. అవి తాగునీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలకు ప్రమాదం ఉంటుంది. అది మున్ముందు ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
