
తయారీ రంగం వృద్ధిలో వైసీపీ పాలనలోనే ఏపీ అగ్రస్థానం: జగన్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువ నాశనమైందని అధికార టీడీపీ–జనసేన కూటమి చేస్తున్న ఆరోపణలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, 2019–24 మధ్యకాలంలో రాష్ట్రం పరిశ్రమలు, తయారీ రంగాల్లో మంచి ప్రదర్శన కనబరిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలలో ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తమ పాలన కాలంలో దేశవ్యాప్తంగా తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని జగన్ తెలిపారు. తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధిలో 2019–24 మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, దేశంలో ఐదో స్థానం సాధించిందని జగన్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
గణంకాలు చూడండి
అదేవిధంగా, పరిశ్రమల రంగ వృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలవగా, జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానం దక్కించుకుందని ఆయన వెల్లడించారు. ఇలాంటి గణాంకాలు ఉన్నప్పటికీ ‘బ్రాండ్ ఏపీ నాశనమైంది’ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది విధ్వంసమా, లేక మార్పు తీసుకొచ్చిన నాయకత్వం వల్ల వచ్చిన ఆర్థిక వృద్ధియా? అని జగన్ ప్రశ్నించారు. ఈ గణాంకాలతో టీడీపీ–జనసేన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని స్పష్టమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంపై ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది’ అంటూ టీడీపీ, జనసేన నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.
అది నిజమైతే పరిశ్రమలు, తయారీ రంగాల్లో రాష్ట్ర ప్రదర్శన దయనీయంగా ఉండాల్సింది. కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
