
తమిళ రాజకీయాలలోకి మళ్ళీ కచ్చతీవు దీవి పాత్ర
రాబోయే రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు కె. అన్నామలై అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)పై విమర్శలు గుప్పించారు.
డీఎంకే మళ్ళీ పదవిలోకి రావడం కోసం ఎన్నికలకు ఒక రోజు ముందు, ఓట్ల కోసం డబ్బు బలాన్ని ఆశ్రయిస్తోందని అన్నామలై ఆరోపించారు. డీఎంకేను అధికారం నుండి తొలగించడానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని డీఎంకే ధైర్యంగా విశ్వసిస్తోంది. తాము నాలుగు సంవత్సరాలుగా పోగు చేసుకున్న సంపదను ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగించవచ్చని భావించి, డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఓట్లను కొనుగోలు చేయగలమని వారు నమ్ముతారు. డీఎంకేను అధికారం నుండి తొలగించాలి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి రావాలి. ఓట్లు చీలిపోతే తాము అధికారంలోకి వస్తామని డీఎంకే అహంకారంతో ఉంది. మేము ఆ భావనను బద్దలు కొట్టి, మా పార్టీకి అన్ని ఓట్లను దక్కించుకోవాలి. మేము డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లతో పాటు సాధారణ ప్రజల ఓట్లను కూడా గెలుచుకోవాలి," అని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్, కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నప్పుడు డీఎంకే చేసిన పని గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా దేశంలో ఒక భాగాన్ని మరొక దేశానికి ఎలా అప్పగించగలుగుతారని ప్రశ్నించారు. ఈ విషయం పై మీడియాతో నాగేంద్రన్ మాట్లాడుతూ, "కాంగ్రెస్‌తో పొత్తులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఏమి చేశారు? వారు కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకున్నారా? కచ్చతీవును శ్రీలంకకు ఎవరు ఇచ్చారు? ఇందిరా గాంధీనే కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. ఆ సమయంలో, కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ, దురై మురుగన్ అసెంబ్లీలో కచ్చతీవు మాకు తెలియకుండా శ్రీలంకకు ఇవ్వబడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా దేశంలో ఒక భాగాన్ని మరొక దేశానికి అప్పగించవచ్చా?" అని అన్నారు.
అసలు కచ్చ తీవు కథ.. ఏంటి ?
భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంక కు అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
తమిళనాడు రామేశ్వరం దీవికి సమీపంలో భారత్ - శ్రీలంకను వేరుచేస్తున్న పాక్ జలసంధిలో ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. పాక్ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు. ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీనిపరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో వీరిపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా, శ్రీలంక ఖాతరు చేయడం లేదు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు
మన భూభాగాల్ని ఇతర దేశాలకు ఇవ్వవచ్చా ?
భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్ - తూర్పు పాకిస్థాన్‌ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్ గవర్నర్ ఫిరోజ్‌ఖాన్ నూన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఇచ్చారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని పేర్కొంది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంతప్రాంతాన్ని తూర్పు పాక్‌కు ఇచ్చారు.
కచ్చతీవు అప్పగింత చెల్లుతుందా?
కచ్చతీవు ప్రాంతం స్వాతంత్రయం రాకపూర్వం రామనాధపురం పాలకుల ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం ఉన్న రామేశ్వరంతో సహా పలుదీవులపై ఈ రామనాధపురం జమీందారుల పాలన సాగేది. అనంతరం వీరు భారత్‌లో చేరడం, తమిళనాడు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి.
1974 తరువాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది. ఎన్నికల అనంతరం మరుగునపడుతోంది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలోనే దాడులకు దిగుతుండటం గమనార్హం. లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం, మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుందుడుకు చర్యలకు కొలంబో దళాలు పాల్పడుతున్నాయి. వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తమిళ రాజకీయపక్షాలు కోరుతున్నాయి. అయితే వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి.. ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
