Let's talk: editor@tmv.in
తమిళ రాజకీయాలపై గవర్నర్‌ రవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తమిళ రాజకీయాలపై గవర్నర్‌ రవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pinjari Chand
26 నవంబర్, 2025

తమిళనాడులో రాజకీయాలు కేవలం ప్రాంతీయతకే పరిమితం కావని, వాటి వెనుక ‘తమిళ ప్రత్యేకత’ అనే భావజాలమే నడుస్తోందని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి మళ్లీ ఒక్కసారి విమర్శలు సంధించారు. తమిళ ప్రత్యేకత అంటే ఇతర భాషల కంటే ప్రత్యేకమని చెప్పే భావజాలం. అదే ఇక్కడి రాజకీయాలకు బలమని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వంతో తరచూ తగాదాలు పెట్టుకుంటున్న గవర్నర్ రవి, ఓ టీవీ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలతో మరోసారి చెన్నైలో రాజకీయ వేడిని పెంచారు. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు ఆమోదం చేయడం లేదని ఇప్పటికే గవర్నర్ కు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వానికి మధ్య తారా స్థాయిలో వివాదాలు నెలకొన్నాయి.

హిందీపై వ్యతిరేకమే కాదు..ఇతర ద్రావిడ భాషలపైనా ద్వేషమే

తమిళ ప్రత్యేకత పేరుతో కొందరు నాయకులు తెలుగు, కన్నడ, మలయాళం వంటి ద్రావిడ భాషలపైనా విద్వేష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కేవలం హిందీ ఎజెండా కాదు. ఇతర ద్రావిడ భాషలపైనా అలాంటి భావజాలమే కొనసాగుతోందని తెలిపారు.తమిళ రాజకీయ నాయకులు తమిళ భాషను, తమిళ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఏమీ చేయలేదని, వారు నిజంగా తమిళాన్ని ప్రేమించరని కూడా ఆయన విమర్శించారు.

తమిళ్ నుంచి ఇంగ్లీష్ మాధ్యమానికి

విద్యార్థులు వేల సంఖ్యలో తమిళ్ మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియానికి మారిపోతున్నారు. తమిళంలో చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనిపై ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడరని దుయ్యబట్టారు. తమిళ భాష–సంస్కృతి పరిశోధనకు ప్రభుత్వం జీరో బడ్జెట్‌ కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర పురావస్తు శాఖలో 11 లక్షలకు పైగా ఉన్న తాళపత్రాలు పాడైపోతున్నాయి. వాటి సంరక్షణకు పైసా విదిలించలేదని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

తమిళ్‌ తాయి వజ్హ్తు’ వివాదం— ‘చిన్న తప్పును పెద్దది చేశారు’

2024 అక్టోబర్‌లో దూరదర్శన్ నిర్వహించిన 'తమిళ్‌ తాయి వజ్హ్తు' కార్యక్రమం చుట్టూ ఉన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ, 'ద్రవిడ' అనే పదం లేకుండా తమిళ గీతం పాడారని ఆరోపిస్తూ, డిఎంకె నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఏమీ లేకుండా గొడవ చేసిందని గవర్నర్ అన్నారు. తాను ఆ కార్యక్రమానికి అతిథిగా మాత్రమే వెళ్లానని , నిర్వాహకులు తప్పు చేశారని, కానీ క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు. నిజానికి, తమిళం గురించి మాట్లాడే చాలా మంది కంటే నేను తమిళ థాయ్ వాళ్తు(తమిళనాడు అధికారిక రాష్ట్ర గీతం)ను చాలా బాగా పాడగలను అని గవర్నర్ అన్నారు.

అసెంబ్లీ నుంచి వెళ్లడం నాకు బాధే

జనవరిలో అసెంబ్లీ తొలి సమావేశంలో జాతీయ గీతం ప్లే చేయకపోవడంతో వాకౌట్‌ చేయాల్సి వచ్చిందని గవర్నర్ వివరించారు. ‘అసెంబ్లీకి ప్రసంగం చదవడానికి వెళతారు,బయటికి వెళ్లడానికి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజ్యాంగ గౌరవం నాకు ముఖ్యమైనది. జాతీయ గీతం లేకపోతే నేను ఎలా కూర్చుంటాను? అని ప్రశ్నించారు. గవర్నర్ లేదా రాష్ట్రపతి పాల్గొనే అటువంటి కార్యక్రమాలలో, అది జాతీయ గీతంతో ప్రారంభమై దానితోనే ముగుస్తుందని ఆయన తెలిపారు.

తమిళ రాజకీయాలపై గవర్నర్‌ రవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు - Tholi Paluku