Let's talk: editor@tmv.in
తమిళులు ఎవరికీ తలవంచరు: సీఎం స్టాలిన్

తమిళులు ఎవరికీ తలవంచరు: సీఎం స్టాలిన్

Pinjari Chand
25 డిసెంబర్, 2025

తమిళులు ఎప్పటికీ ఎవరిముందు తలవంచరు, ఆధిపత్యానికి లోంగరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. సామాజిక సంస్కర్త పెరియార్ ఈ.వీ.రామసామి 52వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ ఆత్మగౌరవం, తార్కిక ఆలోచన, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో నాటిన మహానుభావుడిగా పెరియార్‌ను స్టాలిన్ ప్రశంసించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో స్టాలిన్, పెరియార్ అణగారిన వర్గాల ప్రజలను గౌరవంతో తలెత్తుకుని నిలబడేలా చేశారని పేర్కొన్నారు. ఆయన జీవితం మొత్తం తమిళనాడు మట్టికే అంకితం చేశారని గుర్తు చేశారు. పెరియార్ ఆలోచనలైన తార్కికత, మానవతావాదం, సామాజిక సమానత్వం తమిళ సమాజానికి ఇప్పటికీ దారి చూపుతున్నాయని, హేతుబద్ధమైన ఆలోచన, మానవ ప్రేమ, సమానత్వ పరిరక్షణ—ఇవే జాతి గర్వానికి అసలైన ప్రతీకలు. ఇవన్నీ పెరియార్ అవిశ్రాంత శ్రమకు మనం చెల్లించే కృతజ్ఞత. పెరియార్ అనే మహా సూర్యుడిని సొంతం చేసుకోలేక, జీర్ణించుకోలేక శత్రువులు తడబడుతున్నారు. తమిళనాడు ఏకమై వారి మోసపూరిత కుట్రలను ఛేదిస్తే విజయం ఎప్పటికీ మనదే. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా పెరియార్‌ను స్మరిస్తూ, వెయ్యేళ్లుగా ఈ సమాజం కోరుకున్న విముక్తికి బీజం వేసిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. భవిష్యత్ తరాలకూ మార్గదర్శకుడిగా నిలిచిన పెరియార్ సిద్ధాంతాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె అన్నారు.

ఆత్మ గౌరవ ఉద్యమం – చారిత్రక ప్రాధాన్యం

ఈ.వీ. రామసామి (పెరియార్) 1925లో ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, నాన్-బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి ఈ ఉద్యమం పునాది వేసింది. తార్కికత, లింగ సమానత్వం, కులవ్యవస్థ వ్యతిరేకత వంటి భావాలను తన పత్రిక ‘కుడి అరసు’ (ది రిపబ్లిక్) ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఉద్యమ చరిత్రలో 1925 సంవత్సరం చాలా కీలకం. మే నెలలో ‘కుడి అరసు’ ప్రారంభం కాగా, నవంబర్‌లో పెరియార్ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమణను ఉద్యమానికి అధికారిక ఆరంభంగా భావించినప్పటికీ, అంతకుముందే ‘కుడి అరసు’ మద్రాస్ ప్రెసిడెన్సీలో సామాజిక సంస్కరణలకు కొత్త దిశ చూపింది.

కాంగ్రెస్‌ను, అలాగే హిందూ కుల ఆచారాల భయంకర రూపాన్ని సూచించే బ్రాహ్మణీయతను పెరియార్ నిర్భయంగా విమర్శించారు. ఈ పోరాటమే తరువాత ద్రావిడ ఉద్యమం ఉద్భవానికి దారి తీసింది.