Let's talk: editor@tmv.in
తమిళనాడు సీఎస్‌పై ఈసీ బదిలీ వేటు

తమిళనాడు సీఎస్‌పై ఈసీ బదిలీ వేటు

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎన్.మురుగానందంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.సాయికుమార్‌ను నియమిస్తూ బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు కేవలం పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఏకపక్ష నిర్ణయం.. ఈసీ తీరుపై స్టాలిన్ ధ్వజం

సీఎస్ బదిలీని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ఏకపక్ష, రాజకీయ దురుద్దేశంతో కూడినదిగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల మధ్యలో ఉన్నతాధికారులను మార్చడం ఏకపక్ష నిర్ణయమని, ఇది నేరుగా బీజేపీకి మేలు చేసేందుకేనని విమర్శించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కమిషన్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదేశాలను అమలు చేస్తోందని ఎక్స్‌ వేదికగా దుయ్యబట్టారు. రాజ్యాంగం ఈసీకి కల్పించిన రక్షణ ఎన్నికల విధులకు వినియోగించాలే తప్ప, అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాదని ఆయన గుర్తు చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేదు?

ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల పరిస్థితులను స్టాలిన్ ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అక్కడి డీజీపీని కానీ, సీఎస్‌ని కానీ మార్చలేదని గుర్తు చేశారు. బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, కేవలం ప్రతిపక్షాలు బలంగా ఉన్న తమిళనాడులోనే అధికారులు ఎందుకు ఈసీ కంటబడుతున్నారని ప్రశ్నించారు. ఇది బీజేపీ-ఏఐఏడీఎంకేల కలయికలో భాగంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు.

విచారణాధికారులపై వేటు

సీఎస్‌తో పాటు ఇతర కీలక విభాగాల్లోనూ ఈసీ మార్పులు చేపట్టింది. ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్‌ను విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న ఎస్.డేవిడ్సన్ దేవశీర్వాదంను బాధ్యతల నుంచి తప్పించింది. బదిలీ అయిన మురుగానందం, దేవశీర్వాదంలకు ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించకూడదని ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్యానికే గండం: సీఎం హెచ్చరిక

ప్రజాస్వామ్యానికి చివరి ఆశ అయిన ఎన్నికల సంఘం కూడా ‘కాషాయీకరణ’ చెందిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసుకునే అధికారాన్ని ప్రధాని మోడీ కైవసం చేసుకున్నారని, దాని ఫలితమే ఇదంతా అని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అధికారులను మార్చినా తమిళనాడులో బీజేపీకి పరాభవం తప్పదని స్పష్టం చేశారు. "దువ్వెనను దాచిపెడితే పెళ్లి ఆగుతుందని భావించడం అవివేకం" అంటూ ఎన్డీయే కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.