Let's talk: editor@tmv.in
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది?

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది?

Aslam
7 జనవరి, 2026

దక్షిణ భారత రాజకీయాలు చాలాకాలంగా ఒక బలమైన నమ్మకానికి లోబడి ఉన్నాయి. సినిమా తారలు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టలనుకున్నప్పుడు వెండితెరపై సంపాదించిన ప్రజాదరణను అంతే సులభంగా ఓట్లు గా మార్చుకోవచ్చన్న భావనలో ఉంటారు. సినిమా రాజకీయాలు రెండు చాలా బిన్నంగా పనిచేస్తాయి. సినిమాలు ఒక తెలిసిన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది అదే విధంగా తమ తమ రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి సులువుగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడతాయి.కానీ చరిత్ర చెబుతున్నది ఏమిటంటే అభిమానము సులభంగా వచ్చినంతగ, అధికారము మాత్రం అంత తేలికగా రాదు. తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం ఈ అపోహను మరోసారి స్పష్టంగా ముందుకు తెచ్చింది.

ఒక సూపర్‌స్టార్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తాడు, సభలకు విపరీతమైన జనసమూహం చేరుతుంది, మీడియా అంతా ఆ హడావుడితో నిండిపోతుంది. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బూత్ స్థాయి నిర్వహణ, సామాజిక సమీకరణలు, పార్టీ క్రమశిక్షణ వంటి కఠిన వాస్తవాలు బయటపడతాయి.

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి రాజకీయ ప్రయాణం అనుకున్నంత సులువుగా ఏమి జరగలేదు.దీనిని అత్యంత స్పష్టంగా అనుభవించారు. ప్రజారాజ్యం పార్టీ అద్భుతమైన జనసమూహాలను సమీకరించినప్పటికీ, ఆ ఉత్సాహాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయింది. చివరికి కాంగ్రెస్‌లో విలీనమైంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ తన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేకపోవడంతో క్రియాశలకంగా రాజకీయాలలో నిలువలేకపోయారు.

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ మొదట్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు, పోటీచేసిన తన సొంత స్థానాన్నే కోల్పోయారు. అయినా రాజకీయాలను వదలలేదు. ఓటమిని రాజకీయ పాఠంగా స్వీకరించి, కూటములు నిర్మించి, చివరికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణం ఒక ముఖ్యమైన రాజకీయ సందేశాన్ని తెలియజేస్తుంది అది ఎంటి అంటే రాజకీయాల్లో ప్రదర్శనకన్నా పట్టుదలకే ఎక్కువ విలువ ఉంటుంది.

తమిళనాడు కూడా ఇదే తరహాలో మరో స్పష్టమైన ఉదాహరణను అందిస్తుంది. కమల్ హాసన్ సిద్ధాంతపరమైన స్పష్టతతో, నైతిక విలువలతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ద్రావిడ రాజకీయ నిర్మాణాల లోతును, బలాన్ని తక్కువగా అంచనా వేశారు. మక్కల్ నీధి మయ్యం ఒక నిర్ణయం తీసుకొని INDIA కూటమికి మద్దతు ప్రకటించింది. తమిళనాడులో డీఎంకే కోసం ప్రచారం చేయడం ద్వారా కమల్ హాసన్ ఆ కూటమిలో భాగమయ్యారు. ఈ మద్దతుకు గుర్తింపుగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో MNMకు ఒక సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. ఈ కూటములు సిద్ధాంతపరమైన స్వచ్ఛతను కాపాడుకోవడానికి స్వతంత్రత ఉపయోగపడవచ్చు, కానీ అధికారానికి చేరుకోవాలంటే కూటములే కీలకం.

ఈ నేపథ్యాన్ని చూస్తే, తమిళగ వెట్రి కజగం ద్వారా విజయ్ చేసిన రాజకీయ ప్రవేశం ఆలోచనతో కూడినదిగా కనిపిస్తుంది. ఆయన తక్షణ ఎన్నికల పోరాటానికి దూరంగా ఉన్నారు. రాజకీయాలను నిరంతర ప్రదర్శనగా మార్చలేదు. మాటలు పరిమితంగా ఉన్నాయి, మౌనం వ్యూహాత్మకంగా ఉంది, హామీలు నియంత్రితంగా ఉన్నాయి. వెంటనే అధికారాన్ని చేజిక్కించుకోవడం కంటే రాజకీయ విశ్వసనీయతను క్రమంగా నిర్మించాలనే ఉద్దేశం ఆయనలో కనిపిస్తుంది. ఇది ఆయనకు ముందు వచ్చినవారు చేసిన పొరపాట్లపై ఉన్న అవగాహనను సూచిస్తుంది.

అయితే జాగ్రత్త మాత్రమే రాజకీయ విజయానికి సరిపోదు. తమిళనాడు ఓటర్లు దీర్ఘకాలిక సిద్ధాంత సంప్రదాయాల్లో, సంజికంగా బలంగా ఉన్నారు. అక్కడి ప్రధాన పార్టీల నిర్మాణం కేవలం వ్యక్తిగత ఆకర్షణపై కాదు. దశాబ్దాల ఉద్యమం, సోషల్ ఇంజినీరింగ్, సంస్థాగత ఉనికిపై ఆధారపడి ఉంది. విజయ్‌కు నిజమైన పరీక్ష అభిమానుల విశ్వాసాన్ని క్రమబద్ధమైన పార్టీ నిర్మాణంగా మార్చడంలో ఉంది.తన సినిమాల నుండి వచ్చిన ప్రజాదరణను దీర్ఘకాలిక ఓటు సమీకరణగా మార్చలేకపోతే ప్రజాదరణ ఉపరితలంగానే మిగిలిపోతుంది.

వ్యక్తిగత ఆశయాలకే పరిమితం కాకుండా విజయ్ ప్రవేశం ప్రజాస్వామ్యంపై కూడా ప్రశ్నలు వేస్తుంది. సినిమా సంఘర్షణలను సరళంగా చూపిస్తుంది. కానీ రాజకీయాలు రాజీని, సహనాన్ని, పదే పదే ఎదురయ్యే పరాజయాలను కోరుకుంటాయి. సినిమా ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చే నటుల పట్ల ప్రజల అంచనాలు, ప్రజాస్వామ్య వాస్తవాలతో ఢీకొన్నప్పుడు నిరాశ తప్పదు.

విజయ్ ఇప్పుడు ఒక సుపరిచితమైన మలుపు వద్ద నిలబడ్డారు. స్వతంత్రంగా పోటీ చేస్తే తక్షణ విజయాలు పరిమితమవుతాయి. కానీ రాజకీయంగా ఒక తిరుగులేని శక్తిగా ఏర్పడవచ్చు. కూటములు అధికారానికి దారి చూపవచ్చు. కానీ గుర్తింపును అంతగారాకపోవచ్చు. సినిమాకు తిరిగి వెళ్లే అవకాశమూ ఇంకా ఉంది. అయితే అది ఆయన నిర్మిస్తున్న రాజకీయ ప్రయాణానికి విరుద్ధంగా మారుతోంది.

విజయ్ నిజంగా విజయవంతం కావాలంటే అది ఆయన స్టార్‌ ఇమేజ్ వల్ల కాదు. ఆ ఇమేజ్‌ను విడిచిపెట్టగల సామర్థ్యం వల్లే. తమిళనాడుకు మరో సెలబ్రిటీ రాజకీయ నేత అవసరం లేదు. అధికారానికి ముందు సవాళ్ళను ఏదురుకుని ఒక సుస్థిరమైన సమాజాన్ని వెలుగు చూపించే నాయకుడు అవసరం. విజయ్ ఆ కఠిన ప్రయాణాన్ని స్వీకరించగలరా అనే ప్రశ్నకే ఆయన భవిష్యత్ లో రాజకీయంగా వేసే అడుగుల పైన ఆధారపడి ఉంటుంది. ఆయన సినిమా రాజకీయాల చరిత్రలో ఒక తాత్కాలిక అధ్యాయంగా మిగిలిపోతారా, లేక నిజమైన రాజకీయ శక్తిగా తయారవుతార అన్నది కాలమే నిర్ణయించాలి.