
తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు: రూ.366 కోట్ల బదిలీల స్కామ్‌లో ఈడీ సంచలన ఆరోపణలు
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ అవినీతి ఉదంతం కలకలం రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాష్ట్ర పురపాలక పరిపాలన, మంచినీటి సరఫరా శాఖలో జరిగిన బదిలీలు నియామకాల అక్రమాల్లో మంత్రి కే.ఎన్. నెహ్రూకు సంబంధం ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో సుమారు రూ. 366 కోట్ల మేర అవినీతి జరిగినట్లు పేర్కొంటూ, మంత్రిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అవినీతి నిరోధక శాఖకు ఈడీ లేఖ రాసింది.
కేసు వివరాలు
2025 ఏప్రిల్‌లో ఒక బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి మంత్రి నెహ్రూ సన్నిహితులు, బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో లభించిన డిజిటల్ సాక్ష్యాలు (వాట్సాప్ చాట్లు, ఫోటోలు, పత్రాలు) పరిశీలించగా, రాష్ట్ర పురపాలక పరిపాలన, మంచినీటి సరఫరా శాఖలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం భారీగా లంచాలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రధాన ఆరోపణలు:
సుమారు 340 మంది అధికారులు, ఇంజనీర్ల బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 7 లక్షల నుండి రూ. 1 కోటి వరకు లంచాలు వసూలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వసూలు చేసిన రూ. 365.87 కోట్లను నిందితులు రియల్ ఎస్టేట్, విదేశీ ఆస్తులు, బంగారం కొనుగోళ్లు విలాసవంతమైన ఖర్చుల కోసం మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఇదే శాఖలో టెండర్ల కేటాయింపులో రూ. 1,020 కోట్ల అవినీతి, అలాగే నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నెలల్లో కూడా ఈడీ హెచ్చరించింది.
మంత్రి కే.ఎన్. నెహ్రూ ఘాటు స్పందన
ఈ ఆరోపణలను మంత్రి నెహ్రూ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలు పావులుగా వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. "నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఈ రాజకీయ కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటాను" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈడీ అందించిన ఈ కీలక సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఈ స్థాయి అవినీతి ఆరోపణలు రావడం అధికార డిఎమ్‌కె పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
