Let's talk: editor@tmv.in
తమిళనాడు మునిగిపోనుందా?

తమిళనాడు మునిగిపోనుందా?

FL - TRND
11 అక్టోబర్, 2025

చేపల్లో రకరకాలున్నాయి. వాటిలో యుగాంత చేపలు ప్రత్యేకమైనవి. నిజానికి వీటి పేరు ఓర్ ఫిష్. అయితే వీటిని ప్రజలు యుగాంత చేపలు అని పిలవడం మొదలుపెట్టడానికి బలమైన కారణం ఉంది. ఈ చేపలు కనిపించిన తర్వాత.. కొన్ని రోజులకు ఏదైనా ప్రకృతి విపత్తు జరుగుతూ ఉంటుంది. అలాంటి విపత్తు జరిగే ముందు.. ఈ చేపలు తమంతట తాముగా.. ఒడ్డుకు వస్తాయి. లేదా జాలర్ల చేతికి చిక్కుతాయి. తాజాగా ఇలాంటి చేప.. తమిళనాడు జాలర్ల వలకు చిక్కింది. రామనాథపురం జిల్లా పాంబన్‌కు చెందిన మత్స్యకారులు అరుదైన చేపను పట్టి ఆశ్చర్యపోయారు. ఈ చేపను డూమ్స్‌డే ఫిష్ అని కూడా పిలుస్తారు. రామేశ్వరం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతానికి వెళ్లి, తిరిగి వస్తున్న జాలర్లకు ఈ మెరుస్తున్న, పొడవైన చేప వలలో పడింది. ఇది సుమారు 6 కిలోల బరువు ఉంది. ఇక వలలో చిక్కుకున్న సమయంలో జాలర్లు ఏదో పెద్ద వస్తువు చిక్కుకుందనుకున్నారు. బలంగా వలను పైకి లాగారు. చూస్తే.. ఈ చేప వలలో కనిపించింది. దీంతో జాలర్లు ఆశ్చర్యంతో పాటూ టెన్షన్ కూడా పడ్డారు.

ఈ ఓర్ చేపలు.. సాధారణంగా సముద్రం పైకి రావు. ఇవి చాలా లోతుల్లో తిరుగుతాయి. తీర ప్రాంతాల వైపు అస్సలు రావు. కానీ.. త్వరలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరగబోతూ ఉంటే.. ఆ సమయంలో ఈ చేపలు.. సముద్ర తీరం వైపు వస్తుంటాయి. అయితే.. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారమూ లేదు. కానీ.. చాలా సందర్భాల్లో ఈ చేపలు కనిపించిన తర్వాత.. వైపరీత్యాలు సంభవించాయి. ఉదాహరణకు 2011లో జపాన్‌లో భూకంపం, సునామీ వచ్చినప్పుడు ఓర్ చేపలు ఒడ్డుకు కొట్టుకురావడం కనిపించింది. అంతేకాదు.. మరిన్ని ఇతర వైపరీత్యాల ముందు కూడా ఈ చేపలు ఒడ్డుకు వచ్చాయి. అందుకే.. దీన్ని చూసిన తర్వాత.. జాలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ఓర్ ఫిష్ అనేది 30 అడుగుల పొడవు వరకు పెరిగే రిబ్బన్ లాంటి చేప. ఇది సాధారణంగా 200 నుంచి 1000 మీటర్ల లోతులో నివసిస్తుంది. తమిళనాడులోని మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఈ చేప వెండి రంగులో ఉంది. జపనీస్ ఇతిహాసాలు, జానపద కథలలో ఓర్ ఫిష్‌లను రాబోయే భూకంపానికి సంకేతంగా చెబుతారు. ఎందుకంటే.. ఈ చేపకు సెన్సార్లు ఉంటాయనీ.. వాటి ద్వారా ఈ చేపలు.. భూమిలో వచ్చే కదలికల్ని ఇట్టే పసిగడతాయని అంటారు. అందుకే భూకంపం రాబోతోందని ముందే కనిపెట్టి.. సముద్ర లోతుల్లో నుంచి.. పైకి వచ్చేస్తాయని చెబుతుంటారు. అందుకే ఈ చేపల్ని యుగాంత చేపలు అంటారు.

ఇటు గతంలో మెక్సికోలో, ఒక పెద్ద భూకంపం రావడానికి ముందు తీరంలో ఓర్ ఫిష్‌లు కనిపించాయి. కానీ శాస్త్రవేత్తలు ఈ నమ్మకాల్ని తోసిపుచ్చారు. ఓర్ ఫిష్ భూకంపాలు లేదా ఇతర విపత్తులను అంచనా వేయగలవని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. కానీ మత్స్యకారులు, ఇంకా చాలా మంది ఈ ప్రచారాల్ని నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిందే రైట్ అనుకుంటే.. మరి ఈ చేపలు పైకి ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న అలాగే ఉంటుంది. దీనికి సైంటిస్టులు ఓ కారణం చెబుతున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినా.. లేదంటే వాతావరణంలో మార్పులు వచ్చినా.. అలాంటి సమయంలో ఓర్ చేపలు పైకి వస్తాయని సముద్ర జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా అరుదైన ఈ చేప తమిళనాడులో కనిపించడం, ఇక తమిళనాడుకి కూడా భారీ భూకంప చరిత్ర ఉండటంతో.. ఈ విషయం ఆందోళన కలిగిస్తోందనే చెప్పాలి. పైగా ఈ ఏడాది తమిళనాడు జాలర్ల వలకు ఓర్‌ షిష్‌ చిక్కడం ఇది రెండోసారి.. మరి చూడాలి.. సైంటిస్టులు చెప్పిందే కరెక్ట్ అవుతుందో లేదా.. ప్రజల నమ్మకాలే నిజమవుతాయో వెయిట్ అండ్ సీ!