Let's talk: editor@tmv.in
తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత విద్య ప్రవేశాలు ప్రారంభం

తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత విద్య ప్రవేశాలు ప్రారంభం

Pinjari Chand
25 అక్టోబర్, 2025

మద్రాస్ హైకోర్టు, సుప్రీం కోర్టు సూచనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు చెల్లించాల్సిన ఆర్‌టీఈ నిధులు విడుదల చేసిన తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశానికి అధికారిక ప్రకటన వెలువడింది. తమిళనాడు ప్రభుత్వం 2025–26 విద్యాసంవత్సరానికి రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) చట్టం కింద ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని 7,717 పాఠశాలలు ఈ ప్రవేశాల కోసం నమోదు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఎల్ కేజీ కి 81,927 మంది విద్యార్థులు, 1వ తరగతికి 89 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అధికారిక వివరాల ప్రకారం షెడ్యూల్

అక్టోబర్ 30: డ్రా అవసరం లేని పాఠశాలల్లో అర్హులైన పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తారు

అక్టోబర్ 31: సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పాఠశాలల్లో లాటరీ (డ్రా ఆఫ్ లాట్స్) ద్వారా చేర్చుకుంటారు.

ఈ డ్రా ప్రక్రియ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు ఈఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేసి, వారిని అధికారికంగా ఆర్‌టీఈ కోటా కింద చేర్చుతారు.

• తల్లిదండ్రులకు, పాఠశాలలకు ప్రభుత్వ సూచనలు:

• ఆర్‌టీఈ అర్హులైన విద్యార్థుల నుంచి ఏ విధమైన ట్యూషన్ లేదా అడ్మిషన్ ఫీజు వసూలు చేయకూడదు.

• ఇప్పటికే వసూలు చేసినట్లయితే, 7 పని దినాల్లోపు తిరిగి చెల్లించాలి.

• ప్రవేశ ప్రక్రియను జిల్లా పర్యవేక్షణ కమిటీలు, రాష్ట్ర సహాయ కేంద్రాలు పర్యవేక్షిస్తాయి.

ప్రతి ప్రైవేట్ (ప్రభుత్వ సహాయం పొందే), ఎయిడెడ్ పాఠశాలలు తమ పాఠశాలలో మొదటి తరగతి లేదా ప్రీ-స్కూల్ స్థాయిలో మొత్తం సీట్లలో కనీసం 25 శాతం సీట్లు సమీప ప్రాంతంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాలని, రైట్ టూ ఎడ్యూకేషన్ యాక్ట్–12(1)సీ చెబుతోంది.ఈ పిల్లలకు ఉచితంగా, తప్పనిసరి ప్రాథమిక విద్య (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) అందించాలి.

ఆర్‌టీఈ చట్టం 2009 ప్రకారం, అన్ ఎయిడెడ్, ప్రైవేట్, మైనారిటీ పాఠశాలల్లో 25% సీట్లు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాలి.

ముఖ్యంగా వీరికి కేటాయించాలి :

అనాథ పిల్లలు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు, హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు, దివ్యాంగ పిల్లలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రతి చిన్నారికి ఉచిత, తప్పనిసరి విద్య హక్కు పొందేలా సమానత్వం, పారదర్శకత, పిల్లల సంక్షేమం ప్రాతిపదికగా ఆర్‌టీఈ 25శాతం ప్రవేశాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు రాష్ట్రానికి 2024-25 విద్యాసంవత్సరానికి ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ ద్వారా సుమారు రూ604.68 కోట్లను కేటాయించింది. అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు సుమారు రూ362.81 కోట్లుగా ఉంది.

ఆర్టీఈ–2009 చట్టం అమలులోకి వచ్చిన 2010 నాటి నుంచి నేటి వరకు కేవలం కొన్ని రాష్ట్రాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే 25శాతం అణగారిన, బలహీన వర్గాల పిల్లలకు కేటాయిస్తున్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈని పకడ్బందీగా అమలు చేస్తున్న రాష్ట్రాలు

• మహారాష్ట్రలో

100శాతం ఆన్‌లైన్లో విధానంలో నిర్వహిస్తోంది. దేశంలో ఆర్టీఈని అత్యధికంగా అమలు చేస్తోంది. ప్రతి ఏడాది 1 లక్షకు పైగా పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

• తమిళనాడులో ఈఎంఐఎస్ పోర్టల్ ద్వారా కచ్చితమైన డిజిటల్ ట్రాకింగ్. సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు ఆటోమేటిక్‌గా ఆర్టీఈ కోటాలో ట్యాగ్ అవుతారు. మద్రాస్ హైకోర్టు పర్యవేక్షణలో నిబంధనలు కఠినంగా అమలు.

• రాజస్థాన్ ఈ చట్టాన్ని తొలి దశలోనే అమలు చేసిన రాష్ట్రం. ఆన్‌లైన్ లాటరీ వ్యవస్థ, జిల్లా స్థాయి పర్యవేక్షణ బలంగా ఉంది. ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు చేపడుతున్నారు.

• గుజరాత్ లో ‘ఆర్టీఈ గుజరాత్’ పోర్టల్ ద్వారా పూర్తి లాటరీ పద్ధతిలో నిర్వహిస్తారు. లబ్ధిదారుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

• మధ్యప్రదేశ్ లో స్థిరమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పంచాయతీ స్థాయి కమిటీలు క్రాస్-వెరిఫికేషన్ చేస్తాయి.

• కర్ణాటకలోనూ డిజిటల్ లాటరీ వ్యవస్థ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పాఠశాలల సీట్ల వివరాలు పబ్లిక్‌గా ఉంటాయి. ఇక్కడ తల్లిదండ్రులు లాటరీ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

• ఢిల్లీ లో పారదర్శక లాటరీ, ఫిర్యాదు వ్యవస్థ,

తల్లిదండ్రుల ఫిర్యాదులు పరిష్కరించే ప్రత్యేక సెల్ ఉంది.

ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని పాక్షికంగా అమలు చేస్తున్నాయి.

ఈ చట్టం అమలుకాకపోవడానికి ప్రధాన కారణాలు

చాలా ప్రైవేట్ పాఠశాలలు 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని భావించడం. ప్రభుత్వం సమయానికి రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం కారణాలుగా చూపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి, సరైన సమగ్ర పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఆర్టీఈ గురించి , ఎలా దరఖాస్తు చేయాలో తెలియకపోవడం వలన సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆయా పాఠశాలలు కూడా కావాలనే సమాచారాన్ని దాచిపెడతాయి. చాలా రాష్ట్రాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పలు ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్‌లు, తాగునీరు, ఉపాధ్యాయుల కొరత వంటివి వేధిస్తున్నాయి. ఫలితంగా, తల్లిదండ్రులు దరఖాస్తు చేయడం లేదు. దీంతో ప్రతి పిల్లవాడికి ఉచిత, నాణ్యమైన విద్య హక్కు అందించాలన్న ఆర్టీఈ లక్ష్యం నెరవేరడం లేదు.

తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత విద్య ప్రవేశాలు ప్రారంభం - Tholi Paluku