Let's talk: editor@tmv.in
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Pinjari Chand
12 నవంబర్, 2025

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. సవరణ చట్టబద్ధతపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై ఒకే విధమైన నిర్ణయం అవసరం. అందుకే హైకోర్టులు ఈ విషయంలో విచారణ చేయకుండా నిలిపివేయాలని బెంచ్‌ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 26న ఉంటుందని తెలిపింది.

ఎన్నికల సంఘం వేగంగా ప్రక్రియ చేపడుతోంది

ఈ సవరణ ప్రక్రియను డీఎంకే, సీపీఐ(ఎం) తమిళనాడులో, టీఎంసీ ఎంపీ డోలా సేన్, రాష్ట్ర కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో సవాల్‌ చేశారు. డీఎంకే తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్ సాధారణంగా ఓటర్ల జాబితా సవరణకు మూడు సంవత్సరాలు పడుతుంది. కానీ ఈసారి ఎన్నికల సంఘం చాలా వేగంగా ప్రక్రియను చేపడుతున్నది. నవంబర్‌, డిసెంబర్‌లో తమిళనాడులో వర్షాలు, డిసెంబర్‌, జనవరిలో పంట కోతలు, క్రిస్మస్‌ సెలవులు ఉండటంతో ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉంటుందని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ

రాష్ట్రాల పరిస్థితులు వేరువేరు. వర్షాలు ఎక్కడైనా, పంట కాలం ఎక్కడైనా వేరేలా ఉంటుంది. ఈ కారణంగా సవరణ ఆపడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్) తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎన్నికల సంఘం ఓటర్లకు ఫారం సమర్పించిన తర్వాత ధృవీకరణ స్లిప్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. కోర్టు దీనిపై కూడా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఎప్పుడు ముగుస్తుంది?

ఎన్నికల సంఘం గత నెలలో ప్రకటించిన ప్రకారం, రెండో దశ ప్రత్యేక సవరణ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగనుంది. తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 7, 2026న విడుదల కానుంది. ఆ రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఎన్నికల జాబితా సవరణపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.