Let's talk: editor@tmv.in
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిదే అధికారం: సర్వే

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిదే అధికారం: సర్వే

Pinjari Chand
24 మార్చి, 2026

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి ఘన విజయం సాధించే అవకాశముందని అగ్ని న్యూస్ సర్వే అంచనా వేసింది. చెన్నైకు చెందిన అగ్ని న్యూస్ సర్వీస్ సోమవారం విడుదల చేసిన అభిప్రాయ సర్వే ప్రకారం, డీఎంకే కూటమి సుమారు 44.9 శాతం ఓట్లను సాధించి, 234 అసెంబ్లీ స్థానాల్లో 180 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆల్‌ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) కూటమి 38.5 శాతం ఓట్లు సాధించి కేవలం 54 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. చెన్నై ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని, మధ్య ప్రాంతంలో కేవలం 2 సీట్లు మాత్రమే దక్కుతాయని పేర్కొంది. నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగానికి 9.7 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని, సీమన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌‌ కట్చికు 4.8 శాతం ఓటు షేర్ దక్కుతుందని అంచనా వేసింది. ఇతర పార్టీలకు కలిపి 2.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఎన్నికల్లో విజయ్, సీమాన్ ఇద్దరూ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రభావం విషయానికి వస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్‌కు అత్యధిక ప్రజాదరణ ఉందని, కాగా ఎడప్పాడి పళని స్వామి ప్రభావం తక్కువగా ఉందని తెలిపింది.

ప్రాంతాల వారీగా చూస్తే

దక్షిణ ప్రాంతం (58 సీట్లు): డీఎంకే 42, ఏఐఏడీఎంకే 16, మధ్య ప్రాంతం (37): డీఎంకే 35, ఏఐఏడీఎంకే 2

పశ్చిమ ప్రాంతం (50): డీఎంకే 32, ఏఐఏడీఎంకే 18, ఉత్తర ప్రాంతం (52): డీఎంకే 35, ఏఐఏడీఎంకే 17, చెన్నై (37): డీఎంకే 36, ఏఐఏడీఎంకే 1

చెన్నై ప్రెస్ క్లబ్‌లో అగ్ని న్యూస్ సర్వీసెస్ సీఈఓ ఆర్. సురేష్ కుమార్ మాట్లాడుతూ తమిళ వెట్రి కళగం కార్యకర్తలు భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయ్ పెరంబూర్‌లో రెండో స్థానంలో నిలుస్తారని, సీమాన్ కరైకుడిలో ఓడిపోతారని తెలిపారు. మహిళా ఓటర్లలో 60 శాతం కంటే ఎక్కువ మంది డీఎంకేకు మద్దతు ఇచ్చే అవకాశముందని, మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రభావం చూపాయని సర్వే పేర్కొంది. రూ.5,000 ఆర్థిక సహాయం వంటి పథకాలు మహిళలపై ప్రభావం చూపాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ)కు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ , డీఎండీకే తదితర పార్టీలు మద్దతు ఇస్తుండగా, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు బీజేపీ, పీఎంకే వంటి పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.