Let's talk: editor@tmv.in
తమిళనాడులో హిందీకి ఎప్పటికీ స్థానం ఉండదు: స్టాలిన్

తమిళనాడులో హిందీకి ఎప్పటికీ స్థానం ఉండదు: స్టాలిన్

Pinjari Chand
26 జనవరి, 2026

తమిళనాడులో హిందీకి ఎప్పటికీ స్థానం లేదని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. భాష కోసం ప్రాణాలర్పించిన భాషా వీరుల త్యాగాలను గుర్తుచేస్తూ, హిందీ రుద్దడాన్ని గతంలోనూ, ప్రస్తుతం కూడా, భవిష్యత్తులోనూ తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన ప్రకటించారు. భాషా వీరుల దినోత్సవం సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ తమ భాషను ప్రాణంతో సమానంగా ప్రేమించిన రాష్ట్రం ఇది. హిందీని బలవంతంగా విధించేందుకు యత్నించిన ప్రతిసారి, అదే స్థాయిలో ప్రజలు ఏకమై పోరాడారని అన్నారు. భాషా వీరుల దినోత్సవం – తమిళనాడులో హిందీకి అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు, ఎప్పటికీ లేదని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

1965లో ఉద్ధృతంగా జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన చరిత్రను వివరించే వీడియోను స్టాలిన్ షేర్ చేశారు. ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భాషా వీరుల త్యాగాలు, అలాగే డీఎంకే స్థాపక నేతలు సి.ఎన్.అన్నాదురై, ఎం.కరుణానిధి భాషా ఉద్యమానికి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా తమిళనాడు, భారత ఉపఖండంలోని వివిధ భాషా సమూహాల హక్కులు, గుర్తింపులను కాపాడిందని అన్నారు. తమిళం కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన భాషా వీరులకు నా వినమ్ర నివాళులు. ఇకపై భాషా యుద్ధంలో ఎవరూ ప్రాణాలు కోల్పోరు. తమిళంపై మా ప్రేమ ఎప్పటికీ చావదు. హిందీని రుద్దడాన్ని మేము శాశ్వతంగా వ్యతిరేకిస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్, చెన్నైలోని తలముత్తు, నటరాజన్ భాషా వీరుల స్మారక స్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో వారి విగ్రహాలను ఆవిష్కరించారు. 1964–65లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో, ముఖ్యంగా ఆత్మాహుతి ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారిని భాషా వీరులుగా పిలుస్తారు.

ఇప్పటికీ తమిళనాడు రెండు భాషల విధానం (తమిళం–ఆంగ్లం)నే అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ) ద్వారా హిందీని బలవంతంగా విధిస్తున్నారంటూ డీఎంకే ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి, అలాగే తమిళ వెట్రి కజగం నేత విజయ్ కూడా భాషా వీరులకు నివాళులర్పించారు. తల్లి తమిళం మా ప్రాణాలతో సమానం అని పళనిస్వామి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

తమిళనాడులో హిందీకి ఎప్పటికీ స్థానం ఉండదు: స్టాలిన్ - Tholi Paluku