
తమిళనాడులో బస్సు బోల్తా
మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున పెద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. విల్లుపురం జిల్లా తిండివనం సమీపంలో ఒక ప్రభుత్వ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం పట్టుకోట్టై నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఉదయం సుమారు 3.30 గంటల సమయంలో తిండివనం పరిధిలోని జక్కంపెట్టై గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద డ్రైవర్ వేగం తగ్గించకుండానే బస్సును తిప్పడానికి ప్రయత్నించగా, వర్షం కారణంగా రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది.
కాగా గాయపడిన వారిలో నలుగురు పురుషుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా వారిలో ఒకరి చేయి విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్రమైన గాయాలున్న నలుగురిని విల్లుపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
అయితే జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదం నుడి బయటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. వర్షం సమయంలో రోడ్డు పరిస్థితిని గుర్తించకుండా వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
దీంతో డ్రైవర్ పై భారతీయ న్యాయ సంహిత లోని 281వ సెక్షన్ (అజాగ్రత్త డ్రైవింగ్) అదేవిదంగా 125వ సెక్షన్ (నిర్లక్ష్య ప్రవర్తన ద్వారా మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడం) కింద కేసు నమోదు చేసినట్లు తిండివనం పోలీసులు తెలిపారు.అంతేకాక ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని, డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు సాంకేతిక లోపాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇక పోతే బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
