
తమిళనాడులో ప్రముఖ నేతల నామినేషన్లు దాఖలు
తమిళనాడులో ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు చివరి రోజైన సోమవారం పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎడప్పాడి కే.పళనిస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) ప్రధాన కార్యదర్శి అయిన పళనిస్వామి తన స్వస్థలమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన గతంలో ఐదుసార్లు విజయం సాధించారు. ఎల్.మురుగన్ అవనాశి (ఎస్‌సీ) నియోజకవర్గం నుంచి, మాజీ గవర్నర్ తమిళిసై సుందర్‌రాజన్ చెన్నైలోని మైలాపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మరో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ సమర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనర్ నాగేంద్రన్ విరుధునగర్ జిల్లాలోని సత్తూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఇక డీఎంకే సీనియర్ నేత, జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ వేలూరు జిల్లాలోని కాట్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రేమలత వృద్ధాచలం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అన్భుమణి రాందాస్ భార్య సౌమ్య అంబుమణి ధర్మపురి నుంచి పోటీకి దిగారు. లాటరీ వ్యాపారి శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోస్ తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి నుంచి నామినేషన్ సమర్పించారు. ఇప్పటికే గత వారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ , నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, అలాగే సీమన్ వంటి నేతలు ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 30న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఇప్పటివరకు స్వతంత్రులు సహా 3,700 మందికి పైగా అభ్యర్థులు 234 అసెంబ్లీ స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7న జరుగుతుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.
