
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
రాష్ట్రంలో ‘సీ’ ‘డీ’ కేటగిరీల్లో పని చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు 20 శాతం బోనస్, ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.376.01 కోట్లు ఈ సంవత్సరం చెల్లించనుంది. వివిధ సహకార సంస్థలు, సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అలాగే ఈ చర్య వల్ల కార్మికుల్లో మనోధైర్యం పెరుగుతుందని, ఈ పండుగ సీజన్ ను ఆనందంగా జరుపుకునేలా సహకారం అందుతుందని సీఎం స్టాలిన్ వివరించారు.
వారివల్లే అభివృద్ది
రాష్ట్రంలో అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు ఎర్పాటు అయినప్పటికి కార్మికుల అవిశ్రాంత కృషి, వారి సహకారం వల్లే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విదేశీ పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు నిలవడానికి వీరి శ్రమే ప్రధాన కారణమని ప్రశంసించారు. 2024-25 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 9.69 శాతంగా ఉందని, ఇది భారతదేశ రాష్ట్రాలలో అత్యధికం అన్నారు. నాలుగు సంవత్సరాలుగా తమిళనాడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందన్నారు. ఇది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలలోని కార్మికులు, ఉద్యోగులు అధికారుల నిరంతర కృషి వల్లే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులు తమిళనాడు అభివృద్ధికి వెన్నెముకగా నిలిచారని కొనియాడారు.
మహిళల భాగస్వామ్యం కూడా ప్రధానమే
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తమిళనాడులో మహిళల పాత్ర కూడా గణనీయంగా ఉందని సీఎం తెలిపారు. వారిని సామాజికంగా, ఆర్థికంగా శక్తివంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘విడియాల్ పయనం’ పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం), వారికి హస్టళ్ల వసతి కల్పింస్తోందన్నారు. కొత్తగా సంక్షేమ హస్టళ్లను కూడా నిర్మిస్తోందని వివరించారు. వీరు కూడా అనేక రంగాల్లో తమ వంతు కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ముందున్నారని తెలిపారు.ఉత్పత్తి, ఆర్థికవృద్ధికి కార్మికులే చోదక శక్తిగా ఉండడంతో ప్రభుత్వ రంగ కార్మికులను ప్రోత్సహించడానికి బోనస్, ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2015 బోనస్ చట్ట ప్రకారం కనీస వేతనం నెలకు రూ.21,వేలు ఉన్నవారికి బోనస్ లెక్కింపు వేతన పరిమితి నెలకు రూ.7వేలు ఉండనుంది. తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థలలో 'సి''డి' కేటగిరీ ఉద్యోగులందరికీ వర్తించేలా ఈ పరిమితిని సడలించారు . ఈ ఉద్యోగులకు 20శాతం వరకు బోనస్ (8.33 శాతం బోనస్ + 11.67 శాతం ఎక్స్-గ్రేషియా) లభిస్తుంది. అర్హత కలిగిన కార్మికులకు 20 శాతం బోనస్ (8.33 శాతం బోనస్ మరియు 11.67 శాతం ఎక్స్-గ్రేషియా) కూడా లభిస్తుంది. బోనస్‌కు అర్హత ఉన్న శాశ్వత కార్మికులకు కనీసం రూ.8,400, గరిష్టంగా రూ.16,800 దక్కనుంది.దీంతో ప్రభుత్వ రంగ సంస్థలలోని మొత్తం 2,69,439 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
