
తమిళనాడులో నేరాలు పెరిగాయి: విజయ్
తమిళనాడులో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రజలు బాధ్యతారహితమైన, విఫలమైన డీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఎదురుచూస్తున్నారని విజయ్ వ్యాఖ్యానించారు. గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయ్, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ మహిళలు, బాలికలకు రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కూటమిని కాపాడుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. తూత్తుకుడి జిల్లాలో 17 ఏళ్ల బాలిక హత్య, మదురాంతకం సమీపంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి వంటి ఘటనలను ఆయన ప్రస్తావించారు. శివగంగా ఎంపీ కార్తీ చిదంబరం కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగిన ఘటనను కూడా ఉదాహరణగా చెప్పారు. ఇటీవల కోయంబత్తూరులో ఒక పాఠశాలలో భోజనంలో బల్లి పడటంతో 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనను కూడా ఆయన ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో భద్రతతో పాటు ఆహార భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
టీవీకేతో పొత్తు లేదు
ఇదిలా ఉండగా, టీవీకేతో పొత్తుపై జరుగుతున్న చర్చలను ఎడప్పాడి కే.పళనిస్వామి ఖండించారు. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) ప్రధాన కార్యదర్శి అయిన ఆయన, టీవీకేతో ఎలాంటి పొత్తు చర్చలు జరగలేదని తెలిపారు. మీడియా ఊహాగానాలు మాత్రమే ప్రచారం అవుతున్నాయని అన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, ఎల్.మురుగన్‌తో తన సమావేశంలో సీట్ల పంపకంపై ఎలాంటి చర్చలు జరగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 లో ఏప్రిల్–మేలో జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కూటములపై చర్చలు కొనసాగిస్తున్నాయి. 2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి 159 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
