Let's talk: editor@tmv.in
తమిళనాడులో ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తమిళనాడులో ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Pinjari Chand
26 మార్చి, 2026

ఆల్‌ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసింది. మొత్తం 23 మంది అభ్యర్థులతో ఈ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి ప్రకటించారు. ఈ జాబితాలో భాగంగా పళనిస్వామి తన స్వస్థలమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. పార్టీ తమ బలమైన కోటల్లోనే ఎక్కువ మంది నేతలను మళ్లీ బరిలోకి దింపింది.

కీలక అభ్యర్థులు

తొలి జాబితాలో పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించారు. అందులో డి. జయకుమార్ – రాయపురం, సి.వి. శణ్ముగం – మైలాం, సి. విజయభాస్కర్ – విరాళిమలై, కె.పి. మునుస్వామి – వెప్పనహళ్లి, డిండిగుల్, సి. శ్రీనివాసన్ – డిండిగుల్, నాథం, ఆర్. విశ్వనాథన్ – నాథం, ఎస్.పి. వెలుమణి – తొండముత్తూర్, పి. తంగమణి – కుమారపాళయం నుంచి పోటీ చేయనున్నారు. ఇతర అభ్యర్థుల్లో సెల్లూర్ కె. రాజు (మదురై-వెస్ట్), కె.పి. అంబళగన్ (పాలకొడ్), ఆర్. కమరాజ్ (నన్నిలం), ఓ.ఎస్. మణియన్ (వేదారణ్యం), కడంబూర్ సి. రాజు (కోవిల్పట్టి), ఆర్.బి. ఉదయకుమార్ (తిరుమంగలం) తదితరులు ఉన్నారు. విరుధునగర్ జిల్లాకు చెందిన కేటీ రాజేంద్ర బాలాజీ శివకాశి నుంచి పోటీ చేయనున్నారు. అలాగే పి. బెంజమిన్, ఎస్‌.ఎస్‌. కృష్ణమూర్తి, వి.వి. రాజన్ చెల్లప్ప, కె.సి. కరుప్పన్నన్, ఎం.ఆర్. విజయభాస్కర్, థమరై ఎస్. రాజేంద్రన్ వంటి నేతలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కొంతమంది మాజీ మంత్రులపై అవినీతి కేసులు నమోదై ఉన్నప్పటికీ, వారికి మళ్లీ టికెట్లు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా సి. విజయభాస్కర్, కె.సి. వీరమణి వంటి నేతలు అక్రమ ఆస్తుల కేసులను ఎదుర్కొంటున్నారు.

కూటమి సమీకరణాలు

ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీకి 27 స్థానాలు, పీఎంకేకు 18 స్థానాలు, ఏఎంఎంకేకు 11 స్థానాలు కేటాయించారు.ఇతర మిత్రపక్షాలను కలుపుకుని, మొత్తం 234 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో ఏఐఏడీఎంకే పోటీ చేయనుంది. ఇటీవల తమిళ్‌ మానిల కాంగ్రెస్‌ పార్టీకి కూడా 5 స్థానాలు కేటాయించగా, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే.వాసన్‌ ఈ ఒప్పందంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. ప్రధానంగా డీఎంకే నేతృత్వంలోని కూటమి, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేమధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే నామ్‌ తమిళర్‌‌ కట్చి 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ప్రధాన పార్టీల్లో తొలి జాబితా విడుదల చేసింది ఏఐఏడీఎంకేనే కావడం విశేషం. ఇప్పటికే ఏఐఏడీఎంకే ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్‌ ఇస్తామని, అలాగే మగవారికి కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని, తదితర 297 హామీలను ఇచ్చింది.

తమిళనాడులో ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల - Tholi Paluku