Let's talk: editor@tmv.in
తమిళనాడులో ఎన్నికల వరకే కూటమి: సీఎం స్టాలిన్

తమిళనాడులో ఎన్నికల వరకే కూటమి: సీఎం స్టాలిన్

Pinjari Chand
12 ఫిబ్రవరి, 2026

ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌తో జతకట్టే విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన స్టాలిన్, డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వంలో మిత్రపక్షాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించే విధానం తమిళనాడుకు వర్తించదని తేల్చిచెప్పారు. ఇటీవల డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు మంత్రిపదవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాలనలో భాగస్వామ్యం అనే డిమాండ్ తమిళనాడుకు అన్వయించదు. మన ఐక్యతను భరించలేని వారు పన్నిన కుట్ర మాత్రమే అది అని స్టాలిన్ అన్నారు.

అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ డీఎంకే కూటమిలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఖచ్చితంగా మా కూటమిలోనే ఉంటుంది. మా సంబంధాలు సౌహార్దపూర్వకంగా ఉన్నాయి. అనవసర అభిప్రాయాలను సృష్టిస్తోంది మీడియానే అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తన వ్యక్తిగత సంబంధాన్ని స్టాలిన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నాకు అన్నలాంటి వారు. ఆయన మా కుటుంబ సభ్యుడే. మా బంధం రాజకీయాలకు అతీతమని అన్నారు. కూటమిలో తలెత్తిన భిన్నాభిప్రాయాలను సర్దుబాటు చేయడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని సూచించారు.

సీట్ల పంపకంపైనా చర్చలు

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంథగై కూడా డీఎంకే–కాంగ్రెస్ కూటమి ఖరారైందని వెల్లడించారు. ఫిబ్రవరి 22న సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి బలమైనది. ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు తెలిపారు. వరుస విజయాలు సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర అభివృద్ధి అంశంపై మాట్లాడిన స్టాలిన్, తమిళనాడు రెండంకెల వృద్ధి సాధించిందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ వృద్ధిరేటు 1.74 శాతానికి మించి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు పురస్కారాలు ఇస్తోందని, ప్రస్తుత బడ్జెట్‌లో ‘తొజి హాస్టల్ పథకం’ను ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పంపిణీ, ప్రత్యేక పథకాలు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడును నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో తమిళనాడుకు సున్నా లభించిందని ఆయన విమర్శించారు. ఎన్‌డీఏను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల కూటమిగా అభివర్ణించిన స్టాలిన్, దానిని ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’గా కాకుండా దెబ్బతిన్న ఇంజిన్ గా విమర్శించారు. తమిళనాడులో బీజేపీ విధానాలు ఫలించవని, రాష్ట్రానికి దక్కల్సిన నిధులు న్యాయంగా సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సీట్ల సర్దుబాటుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్న డీఎంకే

తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు చర్చలు ఆలస్యమవుతున్నాయన్న కాంగ్రెస్ ఆందోళనల మధ్య అధికార డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 22 నుంచి మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ త్వరలోనే ఈ కమిటీని నియమిస్తారని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరీవాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ కమిటీ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతుందని పేర్కొంది. ఫిబ్రవరి 17న తమిళనాడు ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాల అనంతరం సీట్ల పంచాయితీ కమిటీ చర్చలు ప్రారంభమవుతాయని డీఎంకే స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ఇప్పటికే చర్చలు ప్రారంభించినప్పటికీ, డీఎంకే తమవైపు నుంచి స్పందించలేదని ఆరోపించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. తమిళనాడు–పుదుచ్చేరి రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ డీఎంకే చేస్తున్న ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025 డిసెంబరులో స్టాలిన్‌ను కలిసి చర్చలు ప్రారంభించినప్పటికీ, డీఎంకే ఇంకా కమిటీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. సీట్ల సంఖ్య, పోటీ చేసే నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలంటే తగిన సమయం అవసరమని చోడంకర్ ఢిల్లీలో మీడియాతో అన్నారు.

టీఎన్‌సీసీ అధ్యక్షుడు కే. సెల్వపెరుంథగై కూడా ముందస్తు చర్చల ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ మా వైపు నుంచి ఎలాంటి గందరగోళం లేదు. చివరి నిమిషంలో సీట్లు ఖరారు చేస్తే ఎన్నికల సన్నాహాలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డీఎంకే శ్రేణులు విస్తృతంగా సన్నాహాలు చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించింది. సభ్యత్వ నమోదు, పోలింగ్ బూత్ ఏజెంట్ల శిక్షణ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపింది. త్వరలో మహిళా విభాగం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనుందని పేర్కొంది.

కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు: డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్

2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ డీఎంకేపై ‘అనవసర ఒత్తిడి’ తెస్తోందన్న వార్తలను సీనియర్ డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ బుధవారం ఖండించారు. సీట్ల పంచాయితీపై అధికారిక చర్చలు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాలు తీవ్రతరమవుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో భాగస్వామ్యం, కనీసం 40 స్థానాలు కోరుతోందన్న ప్రచారం జరుగుతోంది. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసింది. అయితే డీఎంకే మాత్రం 2021 స్థితిగతులను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందని ఎందుకు అంటున్నారో తెలియదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గానీ, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కె. సెల్వపెరుంథగై గానీ మాపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని ఎలంగోవన్ మీడియాకు తెలిపారు. జాతీయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రాచుర్యం కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.