Let's talk: editor@tmv.in
తమిళనాడులో ఎన్డీయే సీట్ల కేటాయింపు పూర్తి

తమిళనాడులో ఎన్డీయే సీట్ల కేటాయింపు పూర్తి

Pinjari Chand
24 మార్చి, 2026

తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. ఈ కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీకి 27 సీట్లు, పట్టలి మక్కల్‌ కట్చి (పీఎంకే)కు 18 సీట్లు, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కు 11 సీట్లు కేటాయించినట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యాలయం పురుచ్చి తలైవర్ ఎంజీఆర్‌‌ మాలిగైలో నిర్వహించిన సమావేశంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ వివరాలు వెల్లడించారు. ఇతర మిత్రపక్షాలతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవి ఈ రాత్రికల్లా పూర్తవుతాయని తెలిపారు. ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుందో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సీట్ల పంపకం చర్చలు స్నేహపూర్వకంగా జరిగాయని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని పళనిస్వామి తెలిపారు. ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం ఉదయం చర్చలు ప్రారంభమై, మధ్యాహ్నానికి పూర్తై, సాయంత్రానికి ప్రకటించామని తెలిపారు. ఇది ఎంత వేగంగా జరిగిందో గమనించాలని వ్యాఖ్యానించారు.

210 స్థానాల్లో విజయం సాధిస్తాం: పళనిస్వామి

బీజేపీ సీనియర్ నేత పీయూష్‌గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ , ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సమక్షంలో మాట్లాడిన పళనిస్వామి, ఈ కూటమి విజయవంతమై 234 స్థానాల్లో కనీసం 210 స్థానాలు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి గెలుస్తుంది.. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

డీఎంకే కూటమిపై విమర్శలు

సీట్ల పంపకం విషయంలో డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోందని విమర్శించిన పళనిస్వామి, కమ్యూనిస్టు పార్టీ (సీపీఐఎం)కు సీట్ల కేటాయింపుపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2021లో ఆరు సీట్లు పొందిన సీపీఐ(ఎం) ఇప్పుడు ఐదు సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. తన ఢిల్లీ పర్యటనపై డీఎంకే విమర్శలకు స్పందిస్తూ, సీఎం ఎంకే స్టాలిన్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. డీఎంకేను టార్గెట్ చేస్తూ, అత్యవసర పరిస్థితి (1975–77) విధించిన కాంగ్రెస్‌తో కూటమి కుదుర్చుకున్నారని విమర్శించారు. ఆ సమయంలో మీసా చట్టం కింద జరిగిన చర్యలను కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో పీఎంకే నేత అన్భుమణి రాందాస్ మాట్లాడుతూ, తాను ఇటీవల ఢిల్లీకి వెళ్లినా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవలేదని స్పష్టం చేశారు.

స్పందించిన కనిమొళి

ఢిల్లీ పర్యటనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ, డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. తాము ఢిల్లీకి వెళ్తే సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేయడం అలవాటైందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటన అనేది అభిప్రాయాలు పంచుకోవడానికి, ఎన్నికల విషయాలు చర్చించడానికి మాత్రమే. మేము ఢిల్లీకి వెళ్తే సీఎం భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయేలో ఇతర భాగస్వాములుగా తమిళ మాణిల కాంగ్రెస్ (మూపనార్), ఐజేకే వంటి పార్టీలు కూడా ఉన్నాయి.