
తమిళనాడులో అవినీతి రహిత పాలన అందిస్తాం: పీయూష్ గోయల్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌గోయల్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం సమర్థంగా వినియోగించలేకపోయిందని ఆయన ఆరోపించారు. మధురైలోని తమిళనాడు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో వ్యాపార, పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడిన గోయల్, తమిళనాడు అభివృద్ధికి బీజేపీ ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. మధురైకి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రస్తుత పాలనలో అది నిర్లక్ష్యం, పతనానికి గురైందని విమర్శించారు.
మధురై ఒకప్పుడు తమిళ సంగం వికసించిన పవిత్ర ప్రాంతమని గుర్తు చేసిన ఆయన, ఈ నగరానికి పర్యాటక, వాణిజ్య కేంద్రంగా ఎదగగల సామర్థ్యం ఉందన్నారు. కానీ వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పెట్టుబడిదారులు, పరిశ్రమలు మంచి ప్రభుత్వ వ్యవస్థ, శాంతియుత వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుకుంటాయని గోయల్ చెప్పారు. సరసమైన ధరకు విద్యుత్, వ్యాపారాలకు అనుకూల విధానాలు, ముఖ్యంగా అవినీతి రహిత ప్రభుత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు, వ్యాపార వర్గాలు కష్టపడి పనిచేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వారి సామర్థ్యాన్ని వినియోగించలేకపోయిందని గోయల్ విమర్శించారు. మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ శ్రీనివాసన్‌కు మద్దతుగా ప్రచారం చేయడానికి గోయల్ మధురైకి వచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. ఇటీవల డీఎంకే నేతల వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. తమిళ సంస్కృతిని, మహిళలను గౌరవించని నాయకులను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని వ్యాఖ్యానించారు. మధురై దక్షిణ నియోజకవర్గంలో 2011 నుంచి బీజేపీకి విజయం దక్కలేదు. ప్రస్తుతం అక్కడ మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, డీఎంకే అభ్యర్థి ఎం.భూమినాథన్ తన సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
