Let's talk: editor@tmv.in
తప్పు చేసింది మీరు.. నింద మా పైనేస్తారా: సీఎం

తప్పు చేసింది మీరు.. నింద మా పైనేస్తారా: సీఎం

Panthagani Anusha
22 ఫిబ్రవరి, 2026

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీకి పాల్పడి, ఆ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తప్పు చేసి దొరికిపోయిన వారు ఇప్పుడు ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు.

జంతువుల కొవ్వు వాడకం నిజం కాదా?

తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్పరీక్షల్లో తేలిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. "గత ప్రభుత్వ హయాంలో లడ్డూ రుచి మారిపోయిందని భక్తులు ఆవేదన చెందారు. ఆ సమయంలో లడ్డూ తిన్నప్పుడు మీకు నెయ్యి వాసన వచ్చిందా? సువాసన తెలిసిందా?" అని సభలో ఉన్న ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అపచారాన్ని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చివరికి తన కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్’ సంస్థను ఇరికించాలని చూడటం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

తిరుమల ప్రక్షాళనే మా ప్రాధాన్యత

కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటం తమ బాధ్యతని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే మా లక్ష్యం. బాత్రూమ్లు కడిగే రసాయనాలు కూడా లడ్డూ తయారీలో వాడారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి అని ఏ ప్రార్థనా స్థలం పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ తీరుపై నిప్పులు

ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరై భవిష్యత్ టెక్నాలజీపై చర్చిస్తుంటే కాంగ్రెస్ వారు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని విమర్శించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి అరాచక రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

చెత్త నుంచి సంపద.. సంక్షేమంలో రికార్డు

రాష్ట్రంలో పేరుకుపోయిన 108 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించి మార్చి నెలాఖరు నాటికి 100 శాతం పంచాయతీల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. "రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులలో రూ.1,254 కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను మార్చి 15కల్లా ప్రారంభిస్తాం. సంక్షేమంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం అని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరూ చురుగ్గా ఉండాలని సూచించారు.

వినుకొండకు వరాల జల్లు.. పీ4తో అండ

వినుకొండలో 100 పడకల ఆసుపత్రిని 1000 పడకల స్థాయికి పెంచుతామని, అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీ4 విధానం ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదలను దత్తత తీసుకున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 100 కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. సభకు ముందు సీఎం వివిధ స్టాళ్లను సందర్శించి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.